లండన్: ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడటం సవాల్‌తో కూడుకున్న పని అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. ముఖ్యంగా అక్కడి వాతావరణం బ్యాటర్లకు పరీక్ష పెడుతుందన్నాడు. ఆస్ట్రేలియాతో ఈ నెల 7 నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా పోటీ పడనుంది. ఉపఖండం అవతల తన ఏకైక టెస్టు సెంచరీని ఇంగ్లండ్‌లోనే (2021) చేసిన రోహిత్ ఆదివారం జరిగిన ఓ ఐసీసీ ఈవెంట్‌లో అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడాడు. ‘సాధారణంగానే ఇంగ్లండ్ కండిషన్స్ బ్యాటర్లకు చాలెంజింగ్‌గా ఉంటాయి. వాటిని తట్టుకునేందుకు పక్కాగా ప్రిపేర్ అయితేనే సక్సెస్ సాధించగలం. 2021లో నేను ఒక విషయం గ్రహించా. ఇక్కడ (ఇంగ్లండ్) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడూ క్రీజులో సెట్ అయినట్టు అనుకోలేం. ఎందుకంటే వాతావరణం సవాల్ విసురుతూనే ఉంటుంది.
కాబట్టి మనం సుదీర్ఘ కాలం ఏకాగ్రతతో ఉంటేనే బౌలర్లపై ఎప్పుడు ఎదురుదాడి చేయాలో అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆడుతున్నప్పుడు మన బలాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, ఒక టీ20 వరల్డ్ కప్ నెగ్గినప్పటికీ టెస్టు క్రికెట్టే అల్టిమేట్ ఫార్మాట్ అని హిట్‌మ్యాన్ చెప్పాడు. గత 3–4 ఏండ్ల నుంచి ఈ ఫార్మాట్‌లో ఇండియా మంచి సక్సెస్ సాధించిందన్నాడు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలవడం ద్వారా చివరి అడ్డంకి దాటి, యువకులకు ఆత్మవిశ్వాసం అందించవచ్చని చెప్పాడు. తద్వారా యంగ్‌స్టర్స్ తాము ఆడాలనుకున్న విధంగా ఆడొచ్చని అభిప్రాయపడ్డాడు.