
అమరావతి: టీడీపీ నేతలపై సీరియస్ అయ్యారు నగరి ఎమ్మెల్యే రోజా. ఏపీ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపే వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా సభలో మాట్లాడుతూ.. స్పీకర్‌గా ఎన్నికైనందుకు తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపారు. ఎక్కడైనా మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు గతాన్ని ఉదాహరణగా తీసుకుంటామని.. ఈ రోజు సభలో కొందరు చెప్పిన మాటల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారో తనకు అర్థంకావట్లేదన్నారు. స్పీకర్ కుర్చీని అవమానించడం, దాన్ని దుర్వినియోగ పరచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇదే మొదటిసారి కాదని, గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయనను అవమానపరిచిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు.
ఈరోజు తమ్మినేనిని అగౌరవ పరిచిన తీరును ప్రజలు చూశారన్నారు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమ్మినేని ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికైనందుకు అంతా సంతోషించాలి. శ్రీకాకుళం జిల్లావాసులు చాలా ఆనందపడాలి’ అని రోజా అన్నారు. తమ్మినేని సభాపతి అయినందుకు అచ్చెన్నాయుడికి సంతోషం కంటే కడుపుమంటే ఎక్కువగా ఉన్నట్టు ఆయన మాటల్లో కనబడుతోందని విమర్శించారు రోజా.
ఐదేళ్లలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలకు ఎన్ని రోజులు గుంజీలు తీసి, చెంపలు లెంపకాయలు వేసుకున్నా సరిపోదు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి ఘనంగా జరుపుతారు. కానీ ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకొని అసెంబ్లీలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. యనమల రామృష్ణుడిని ఉపయోగించి సభాపతి స్థానాన్ని ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. గత అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ గురించి నేను మాట్లాడితే రూల్స్‌కు విరుద్థంగా ఏడాది సస్పెండ్ చేశారు. కోర్టు తీర్పును కూడా గౌరవించకుడా నన్ను లోపలికి రానీయకుండా మార్షల్స్‌తో బయటకు నెట్టేశారు. మీరా సభా సంప్రదాయాల గురించి మాట్లాడేది. అంటూ ఫైర్ అయ్యారు రోజా.