స్వతంత్ర సంగ్రామంలో విప్లవ సంస్థలు, విప్లవకారులు

స్వతంత్ర సంగ్రామంలో   విప్లవ సంస్థలు, విప్లవకారులు

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ పార్టీలు, విప్లవకారులు కీలక పాత్ర పోషించారు. రహస్య సంఘాలను స్థాపించారు. వార్తా పత్రికలు, పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించారు. కరువు, అంటువ్యాధుల సమయాల్లో సామాజిక సేవ చేశారు. నిరంకుశంగా వ్యవహరించే బ్రిటీష్​ అధికారులను హతమార్చారు. ఆయుధ సమీకరణ చేసి, బలప్రయోగంతోనే బ్రిటీష్​ వారిని ఎదుర్కొన్నారు. అలాంటి విప్లవ సంస్థలు, విప్లవకారుల గురించి తెలుసుకుందాం. 

అనుశీలన్​ సమితి

ఈ సంస్థ బెంగాల్​లో మొదటి రహస్య సంఘం. 1902, మార్చి 24న కలకత్తా కేంద్రంగా బారిస్టర్​గా పనిచేస్తున్న ప్రమోద మిట్టర్ సహకారంతో సతీష్​ చంద్ర బసు అనే విద్యార్థి నాయకుడు స్థాపించాడు. విప్లవ కార్యక్రమాలను నిర్వహించి విప్లవ జాతీయవాదాన్ని ప్రచారం చేయడం దీని లక్ష్యంగా ఉండేది. భారతదేశంలో అఖాడాలతో అత్యధిక శాఖలు కలిగిన రహస్య సంఘంగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ స్థాపనలో బరీంద్రనాథ్​ ఘోష్, ప్రమోద మిట్టర్, భూపేంద్రనాథ్​ దత్తా, సరళాదేవి ముఖ్యపాత్ర పోషించారు. ఈ సంస్థ ఉపాధ్యక్షులుగా అరబిందో ఘోష్, సి.ఆర్.దాస్ పనిచేశారు. అనుశీలన్​ సమితి పుస్తకాలు భవాని మందిర్(1905), వర్తమాన్ రణనీతి(1907). వీటిల్లో వర్తమాన్ రణనీతి మిలటరీ శిక్షణ, గెరిల్లా యుద్ధ పోరాటాల గురించి వివరించింది. ఈ సంస్థ పత్రికలు సంధ్య, యుగాంతర్. యుగాంతర్ అనే పదానికి అర్థం మార్పు. ఇది వారపత్రిక. ఈ పత్రికలో బరీంద్రకుమార్​ ఘోష్​ నీ జీవితాన్ని ఇస్తూ మరో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లు అని నినాదం ఇచ్చాడు. 1907లో తూర్పు బెంగాల్, అసోం మొదటి లెఫ్టినెంట్​గవర్నర్ అయిన ఫుల్లర్ ను హత్య చేయడానికి ప్రపుల్ల చాకీని ఉపయోగించి బరీంద్రకుమార్ ఘోష్, భూపేంద్రనాథ్​ ఘోష్​ విఫలమయ్యారు. 

డక్కా అనుశీలన్​ సమితి

1902లో అనుశీలన్​ సమితికి అనుబంధంగా డక్కాలో ఈ సంస్థను పులిన్​ బిహారిదాస్ స్థాపించాడు. ఈయనకు డక్కా కుట్ర కేసుతో సంబంధం ఉన్నది. 1929లో భంగీయ భ్యయం సమితిని స్థాపించి యువకులకు కర్రసాము, కుస్తీల్లో శిక్షణ ఇచ్చాడు. 

యుగాంతర్ సమితి

ఈ సంస్థను కలకత్తా కేంద్రంగా 1906లో బరీంద్రకుమార్ ఘోష్​ స్థాపించాడు. అరబిందో ఘోష్, రాజా సుభోద్​ మాలిక్, భూపేంద్రనాథ్​ దత్తాలు ఇతర నాయకులు. ఆలీపూర్ కుట్రకేసు తర్వాత 1910లో జతిన్​ ముఖర్జీ యుగాంతర్ సమితికి నాయకత్వం వహించి 1914 నాటికి బలమైన సంస్థగా నిర్మించాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ పార్టీ జర్మనీ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవాలని ప్రణాళిక రచించింది. ఇందుకోసం జతిన్​ రాస్ బిహారీ బోస్​ను భారత్​పై సరిహద్దుకు నాయకత్వం వహించాలని కోరగా ఆ ప్రణాళిక లీక్ అయింది. దీనినే జిమ్మర్​మాన్ ప్రణాళిక లేదా జర్మన్ ప్లాట్​ అంటారు. దీని ఫలితంగా జతిన్ మరణించాడు. 1938, సెప్టెంబర్ 9న యుగాంతర్ సమితి ఇండియన్​ నేషనల్​కాంగ్రెస్ లో విలీనమైంది.

భూపేంద్రనాథ్​ దత్తా

ఈయన రచయిత, సామాజికవేత్త. భూపేంద్రనాథ్​ దత్తా స్వామి వివేకానంద సోదరుడు. బ్రహ్మసమాజంలో సభ్యుడు. 1902లో అనుశీలన్​ సమితిలో చేరాడు. యుగాంతర్ పత్రికకు 1906 నుంచి ఎడిటర్​గా పనిచేశాడు. 1908లో అమెరికాలోని బ్రౌన్​ యూనివర్సిటీలో పి.జి. పూర్తిచేశాడు. కాలిఫోర్నియాలో గదర్ పార్టీలో చేరాడు.  మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బెర్లిన్(జర్మనీ)లో ఇండియన్ ఇండిపెండెన్స్​ కమిటీ సెక్రటరీగా పనిచేశాడు. 1921లో మాస్కో వెళ్లి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్​లో చేరాడు. ఈ సమావేశంలో బీరెంద్రనాథ్​ దాస్ గుప్తా, ఎంఎన్​ రాయ్​తో కలిసి పాల్గొన్నాడు. ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​లో చేరాడు. ఈయన రచనలు స్వామి వివేకానంద, పాట్రియట్​– ప్రొఫెట్. 

బరీంద్రకుమార్​ ఘోష్​

ఈయన అరబిందో ఘోష్​ సోదరుడు. బరీంద్రకుమార్ ఘోష్​ గురువు ఠాకూర్​ అనుకుల్​ చంద్ర. అలీపూర్​ కేసులో శిక్ష అనుభవించి పాండిచ్చేరిలో అరబిందో ఘోష్​తో హాస్టల్​లో ఉన్నాడు. ఈయన యుగాంతర్(బెంగాలీ వార పత్రిక), ది డాన్​ ఆఫ్​ ఇండియా(1933, ఆంగ్ల వార పత్రిక), దైనిక్​ బాసుమతి(1950, బెంగాలీ) దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఈ పత్రికను ఉపేంద్రనాథ్​ ముఖోపాధ్యాయ్​ స్థాపించాడు. ఈయన రచనలు ది టేల్​ ఆఫ్​ మై ఎక్సైల్. శ్రీ అరబిందో.

జతీంద్రనాథ్​ ముఖర్జీ

ప్రస్తుత బంగ్లాదేశ్​లోని కుస్టియా జిల్లాలో జన్మించాడు. ఇతనిని బాఘా జతిన్​ లేదా టైగర్​ జతిన్​గా పిలుస్తారు. బాఘా జతిన్ అంటే ఏ డివైన్​ పర్సనాలిటీ. దియోఘర్​లో బాంబుల ఫ్యాక్టరీని స్థాపించాడు. హౌరా సిబ్​పూర్​ కుట్ర కేసుతో జతీంద్రనాథ్​ ముఖర్జీకి సంబంధం ఉన్నది. 1915, సెప్టెంబర్​ 10న ఒడిశాలోని బాలసోర్​లో జన్మించాడు. వి షెల్​ డై టు అవెకన్​ ది నేషన్​ అని గర్జించాడు. ఈ మాటను వివేకానందుడి నుంచి మార్గదర్శకంగా తీసుకున్నాడు. 

హేమచంద్ర కానుంగో

అనుశీలన్​ సమితి ఆధ్వర్యంలో కలకత్తాలోని మానిక్​తొల్లలో బాంబుల ఫ్యాక్టరీని స్థాపించాడు. ఈయన బాంబుల తయారీలో సిద్ధహస్తుడు. ఆలీపూర్​ బాంబు కేసులో నిందితుడు. 1907లో బరీంద్రకుమార్​ ఘోష్​ బాంబుల తయారీని నికోలస్ సఫ్రాన్​ స్కీ దగ్గర నేర్చుకోవడానికి హేమచంద్ర కానుంగోను ప్యారిస్​కు పంపాడు. 

సూర్యసేన్​

ఈయన మాస్టర్​ దా (దా అంటే బెంగాల్​లో గౌరవించే పదం) అని పిలిపించుకున్నాడు. ఈయన ఒక టీచర్. బంగ్లాదేశ్​ జాతీయ వీరుడిగా పిలిచేవాడు. అనుశీలన్​ సమితిలో సభ్యుడు. సూర్యసేన్ నాయకత్వంలో చిట్టగాంగ్​ రైల్వేస్టేషన్​పై 1924లో దాడి జరిగింది. 1930లో చిట్టగాంగ్​ ఆయుధగారంపై దాడి చేశాడు. ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈయనతోపాటు కల్పనా దత్తా, ప్రీతిలతా వడ్డేకర్​ ఈ దాడిలో పాల్గొన్నారు. నేత్రసేన్​ చేసిన నమ్మకద్రోహం వల్ల 1932, ఫిబ్రవరి, 16న బ్రిటీష్​ వారు ఈయన్ని పట్టుకున్నారు. సూర్యసేన్, తారకేశ్వర్​ దస్తిదార్​ను 1934, జనవరి 12న చిట్టగాంగ్​ జైలులో ఉరితీశారు. వీరి శవాలను క్రూజియర్​ నౌక అయిన దిరి మీద తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేశారు. బ్రిటీష్ అధికారులను చంపడం, బహిరంగ దోపిడీలు చేయడం వంటి విప్లవ కార్యక్రమాలకు సూర్యసేన్​ నాయకత్వం వహించాడు. 

ప్రీతిలత వడ్డేకర్​

ఈమె మరో పేరు రాణి. ప్రీతిలత వడ్డేకర్​ బెంగాల్​ విప్లవ వనిత. సూర్యసేన్ ప్రధాన అనుచరురాలు. పహార్​తలి యూరోపియన్​ క్లబ్​బోర్డుపై డాగ్స్​ అండ్​ ఇండియన్స్​ ఆర్ నాట్​ అలోవ్డ్​ అనే మాటకు వ్యతిరేకంగా 1932, సెప్టెంబర్​24న దాడి చేసింది. బ్రిటీష్​ అధికారులకు పట్టుబడకుండా పొటాషియం సైనైడ్​ మింగి ఆత్మహత్య చేసుకున్నది. 

గోపీనాథ్​ సాహ

ఈయన బెంగాల్​ సమరయోధుడు. భారత విప్లవకారులను హతమార్చడానికి బ్రిటీష్​ నియమించిన ఇన్​స్పెక్టర్​ జనరల్​ చార్లెస్ టెగర్ట్​ను అంతం చేయడానికి గోపీనాథ్​ సాహను చంద్రశేఖర్​ ఆజాద్​ నియమించాడు. టెగర్ట్​పై సాహ కాల్పులు జరపగా అది గురితప్పి ఎర్నెస్ట్ డే అనే వ్యక్తి మరణించాడు. ఈ కేసులో బ్రిటీష్​ ప్రభుత్వం సాహకు మరణదండన విధించింది. నా శరీరంలోని ఒక్కొక్క రక్తపు బొట్టు దేశ స్వాతంత్ర్యానికి బీజమై పెరగాలి అని సాహ నినదించాడు. ఈ మాటలే నేతాజీకి ప్రేరణ కలిగించాయి. సాహ తన మరణానికి ముందు జైలు గోడపై భారతీయ రాజకీయాల్లో అహింసకు తావు లేదు అని రాశాడు. 

జతిన్​దాస్

ఈయన్నే జతింద్రనాథ్​ దాస్​గా పిలుస్తారు. అనుశీలన్​సమితిలో సభ్యుడు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. లాహోర్​ కుట్ర కేసులో 1929, జూన్​ 14న అరెస్టు అయ్యాడు. జైలులో తమను సాధారణ నేరస్తుడిలా కాకుండా రాజకీయ నేరస్తుల మాదిరిగా చూడాలని కోరుతూ నిరాహార దీక్ష చేశాడు. లాహోర్​ జైలులో 64 రోజులపాటు నిరాహార దీక్ష తర్వాత జతిన్​ దాస్ 1929, సెప్టెంబర్ 29న అమరుడయ్యాడు.