పర్యావరణ పరిరక్షణలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పాత్ర.. నిర్మాణం, విధులు, అర్హతలు..!

పర్యావరణ పరిరక్షణలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పాత్ర.. నిర్మాణం, విధులు, అర్హతలు..!

రాజ్యాంగంలోని 21వ అధికరణంలో పేర్కొన్న జీవించే హక్కును స్ఫూర్తిగా తీసుకుని ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని నెలకొల్పడానికి, అలాగే పర్యావరణ సమస్యలను తక్షణం పరిష్కరించడం కోసం పార్లమెంట్ 2010లో చేసిన గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని అనుసరించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేశారు. 1992లో రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం, అభివృద్ధి సమావేశంలో చేసిన తీర్మానాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదికగా చెప్పవచ్చు. అడవులను, సహజ వనరులను, ఇతర పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ప్రజల హక్కులను కాపాడటం గ్రీన్ ట్రిబ్యునల్ ప్రధాన ఉద్దేశం. 

నిర్మాణం:


నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టబద్ధమైన సంస్థ. చైర్మన్ తోపాటు 10 మందికి తగ్గకుండా 20 మందికి మించకుండా జ్యుడీషియల్ మెంబర్స్ సభ్యులుగా ఉంటారు. 10 మందికి తగ్గకుండా 20 మందికి మించకుండా పర్యావరణ సంబంధిత రంగాల్లో నిష్ణాతులైన ఇతర సభ్యులు ఉంటారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. చైర్మన్, సభ్యుల కాలపరిమితి ఐదేండ్లు. పునర్ నియామకానికి అనర్హులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చైర్మన్ లేదా జ్యుడీషియల్ సభ్యులుగా నియమిస్తే వారి పదవీ విరమణ వయస్సు 5 లేదా 75 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తులు జ్యూడీషియల్ సభ్యులుగా నియమిస్తే వారి పదవీ విరమణ వయస్సు 5 లేదా 67 సంవత్సరాలు. పర్యావరణ నిష్ణాతులైన సభ్యుల పదవీకాలం 5 లేదా 65 సంవత్సరాలు. 

అర్హతలు

చైర్మన్​గా జ్యుడీషియల్ సభ్యులుగా నియామకమయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి. నిష్ణాతులైన సభ్యులు పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సుదీర్ఘ అనుభం గల వారై ఉండాలి. 

తొలగింపు/ రాజీనామా

చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు తొలగిస్తుంది. 
అవినీతి, అసమర్థత, దుష్ప్రవర్తన కారణాల వల్ల తొలగిస్తారు. 
వీరందరూ తమ రాజీనామాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. 

అధికార విధులు, పరిధి

  • పర్యావరణానికి సంబంధించిన అన్ని ముఖ్య వివాదాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి.
  • అటవీ పరిరక్షణ చట్టం, జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం, పర్యావరణ చట్టం మొదలైన చట్టాల్లోని అంశాలను విచారిస్తుంది. 
  • మెజారిటీ సభ్యులు ఇచ్చే తీర్పే అంతిమ తీర్పు అవుతుంది. 
  • అయితే, ప్రత్యేక సందర్భాల్లో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును 90 రోజుల లోపల సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. 
  • ప్రస్తుత చైర్మన్ ప్రకాశ్​ శ్రీవాస్తవ.