దేశ హితమే యువత అభిమతం కావాలి

మన అడుగు ప్రగతికి మలుపు కావాలి. మన లక్ష్యం అంతిమంగా దేశ క్షేమానికి ఉపయో గపడాలి. అందుకు ప్రతీ ఒక్కరూ విజ్ఞాన సముపార్జన చేయాలి. భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాయి. ఇంతకు పూర్వమే ప్రపంచం అనేక అంటువ్యాధులతో, మహమ్మారులతో పోరాడి విజయం సాధించింది. కరోనా కంటే దారుణంగా విజృంభించిన మహమ్మారులతో కోట్లాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. మశూచి, ప్లేగు, స్ఫానిష్ ఫ్లూ, ఎయిడ్స్ వంటి రోగాలతో ప్రపంచం పోరాడింది. కరోనాపై కూడా పోరాడి ప్రపంచం అంతిమంగా విజయం సాధించిందనే చెప్పాలి. ఇండియా ఈ విషయంలో ప్రపంచంలో ముందు వరసలో ఉంది. మిగిలిన విషయాల్లో కూడా దేశం ప్రపంచంతో పోటీ పడుతున్న మాట సత్యం. ప్రపంచమంతా సాంకేతిక విప్లవం వైపు పరుగులు తీస్తున్నది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన పెనుమార్పులు ప్రపంచ గమనాన్నే మార్చేశాయి. ప్రజల అవసరాలను తీర్చడం, వాతావరణ మార్పులను అవగాహన చేసుకుని, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడటం, కరువు కోరల నుంచి కాపాడి, ప్రజలకు ఆహార భద్రతను కల్పించడం, పెరిగే జనాభాకు సరైన సౌకర్యాలను కల్పించడం, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్నత లక్ష్యాలను సాధించడం వంటి ప్రజోపయోగకరమైన లక్ష్యాల కోసమే భారత దేశం సాంకేతిక  పరిజ్ఞానాన్ని వినియోగించడం గమనార్హం. మన దేశం ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శప్రాయం.

సాంకేతిక పరిజ్ఞానం

సాంకేతిక రంగాన్ని విధ్వంసానికి వాడే దేశాలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు మాత్రమే వాడాలనే దృష్టి లేకుంటే భవిష్యత్తులో అనేక ప్రమాదకర ధోరణులు ఏర్పడతాయి. మన దేశాన్ని రక్షించుకోవడానికి, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం, శత్రువ్యూహాలను ఛేదించి, దేశ సమగ్రతను కాపాడుకోవడానికి మనం సాంకేతిక రంగాన్ని సద్వినియోగం చేసుకోవడం హర్షదాయకం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తుంది. మన దేశంలో యువశక్తికి కొదవలేదు. ఇండియా మేథాసంపత్తికి పెట్టింది పేరు. ప్రపంచానికి విజ్ఞానమంటే తెలియని రోజుల్లోనే మన భారతీయ మేధావులు అప్పటికి అందుబాటులో ఉన్న పరిమితమైన అవకాశాలను వినియోగించుకుని, ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు అంకురార్పణ చేశారు. ఇప్పటి ఆధునిక ప్రపంచం వల్లె వేస్తున్న అనేక విషయాల పట్ల అప్పట్లోనే  అలనాటి మన మేధావులతో పాటు, సామాన్య ప్రజానీకానికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. దురదృష్టవశాత్తూ భారతీయ మేధాసంపత్తిని కొన్ని దేశాలు కొల్లగొట్టాయి.

యువత చేతిలో దేశం

గణిత, ఖగోళ, అర్థ శాస్త్ర, వైద్యశాస్త్ర రంగాల్లో ప్రాచీన కాలంలోనే భారతదేశం విశిష్ట స్థానం సంపాదించింది. చరకుడు, సుశృతుడు, ధన్వంతరి, ఆర్యభట్ట, వరాహమిహురుడు, భాస్కరుడు...ఇలా ఒకరేమిటి అనేక మంది భారతీయ మేధావులు వివిధ రంగాల్లో విశేష కృషి చేసి ప్రాచీనకాలంలోనే భారతదేశం అంటే ఒక విజ్ఞాన భాండాగారమని చాటారు. ఉపగ్రహాల ప్రయోగాల నుంచి చంద్రయాన్ పయనం వరకు, వైద్య శాస్త్ర పరిశోధనల నుంచి అణ్వస్త్ర ప్రయోగాల వరకు భారతదేశం స్వయం స్వావలంబన దిశగా పయనిస్తున్నది. ప్రపంచాన్ని భయం గుప్పెట్లో బంధించిన కరోనాకు మనదేశం వ్యాక్సిన్ రూపంలో విరుగుడు కనిపెట్టి ఆశ్చర్యపరచింది. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ పాలనా యంత్రాంగాలన్నీ సాంకేతిక విజ్ఞానంతో ముడిపడి ఉన్న కారణంగా  సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమ పద్ధతిలో వినియోగించడం అత్యంత ఆవశ్యకం. విద్రోహుల చేతిలో సాంకేతికత వినాశనానికే తప్ప ఎందుకూ పనికిరాదు. శాస్త్ర  సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ హితానికి, నిర్మాణాత్మక కార్యక్రమాలకు వినియోగించాలి. భారతదేశం స్వతహాగా శాంతికాముక దేశం. అందువల్లే ప్రపంచానికి మనదేశం పట్ల నిగూఢమైన గౌరవం ఏర్పడింది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ఈ దేశ విలువైన సంపద అయిన యువత చేతిలో ఉన్నది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మహనీయుల స్ఫూర్తితో కృషిచేసి, విశ్వవినువీధుల్లో భారతదేశ ఖ్యాతిని ప్రతిధ్వనింప చేయాలి. 
–సుంకవల్లి సత్తిరాజు,సోషల్ ఎనలిస్ట్