కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

తన వాచీ రేటు చూసి కళ్లు తిరిగి పడిపోయిన రిటైర్డ్​ ఎయిర్​ఫోర్స్​ అధికారి

ఆయనో ఆర్మీ వెటరన్​. 1974లో 345.97 డాలర్లు (ఇప్పటి డాలర్​ రేటు ప్రకారం సుమారు రూ.24,655) పెట్టి ఓ రోలెక్స్​ వాచ్​ కొన్నారు. ఓ ప్రోగ్రామ్​లో ఆ వాచీకి వచ్చే ధరెంతో తెలిసి కళ్లు తిరిగి పడిపోయారు. ఇంతకీ ఆ వాచీకి వచ్చే ధరెంతో తెలుసా..? అక్షరాలా 7 లక్షల డాలర్లు (సుమారు రూ.4.98 కోట్లు). అవును మరి, ఎక్కడి రూ.25 వేలు.. ఎక్కడ రూ.5 కోట్లు? అంత రేటు వస్తుందంటే ఎవరికైనా జరిగేది అదే కదా. ఆయన కథేంటి.. ఆ వాచ్​ కథేంటో ఓ సారి చదివేద్దాం.

ఇంతవరకూ వాడలేదు

ఆయన పేరేంటో తెలియదు కానీ, ఒకప్పుడు అమెరికా ఎయిర్​ఫోర్స్​లో పనిచేసేవారు. ఎవరో రోలెక్స్​ వాచీ గురించి గొప్పగా చెబితే ఎయిర్​ఫోర్స్​ బేస్​ నుంచి 1974 నవంబర్​లో రోలెక్స్​ ఓయ్​స్టర్​ కాస్మోగ్రాఫ్​ వాచీని ఆర్డర్​ చేశారట. అది 1975 ఏప్రిల్​లో ఆయన చేతికి వచ్చిందట. స్కూబా డైవింగ్​కు బాగా పనికొస్తుందని చెప్పి దానిని కొన్నారట. కానీ, ఆ వాచీని చూశాక సముద్రంలో ఉప్పు నీళ్లు కాదు కదా.. చిన్న గీత కూడా పడొద్దని చేతికి పెట్టుకోకుండా వాచీ ఎట్లొచ్చిందో అట్లనే భద్రంగా దాచి పెట్టారట. ఎంతలా అంటే ఆ వాచీతో పాటు వచ్చిన వారంటీ పేపర్లు, కొన్న రశీదులతో సహా ఓ బాక్సులో పెట్టి దాచేశారాయన. దాదాపు 40 ఏళ్లు అలాగే పెట్టారట. ఆ వాచీ ఎలా ఉందో తెలుసుకునేందుకు అప్పుడప్పుడు బయటకు తీసేవారట అంతే.

షోలో ప్రదర్శన

సోమవారం నార్త్​ డకోటాలోని ఫార్గోలో ఉన్న బొనాంజావిల్లాలో జరిగిన పీబీఎస్​ సిరీస్​‘యాంటిక్స్​ రోడ్​షో’లో ఆయన పాల్గొన్నారు. ఆ వాచీని ప్రదర్శనకు పెట్టారు. ఇంతలోనే ఆయన దగ్గరకు షో నిర్వాహకులు వచ్చారు. దాని కండిషన్​ చూసి ఆ వాచీని వేలం వేస్తే 4 లక్షల డాలర్లు (సుమారు రూ.2.85 కోట్లు) వస్తాయని చెప్పారు. నిర్వాహకులు అక్కడితో ఆగలేదు. ఇన్నేళ్లయినా చెక్కు చెదరని ఆ వాచీని చూసి, వాటితో పాటు భద్రంగా ఉన్న వారంటీ పేపర్లు, కొన్న రశీదులను పరిశీలించి వాచీని వేలం వేస్తే 5 లక్షల డాలర్ల (సుమారు రూ.3.56 కోట్లు) నుంచి 7 లక్షల డాలర్లు వస్తాయని చెప్పారు. దీంతో ఆ రిటైర్డ్​ ఎయిర్​ఫోర్స్​ అధికారి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. ఆనందం, ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే, ఇదో అత్యంత అరుదైన వాచీ అని షో నిర్వాహకులు అంటున్నారు. అన్నేళ్లు వాడకుండా భద్రంగా దాయడం ఒకెత్తైతే, ఇన్నేళ్లయినా అది పాడవకపోవడం మరో ఎత్తు అని చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే 1969లో వచ్చిన విన్నింగ్​ అనే సినిమాలో పాల్​ న్యూమన్​ అదే మోడల్​ వాచీని పెట్టుకున్నారని, కాబట్టి అది అరుదైనదేనని అన్నారు.

For More News..

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం

ఇప్పుడు కండక్టర్‌.. రేపు కలెక్టర్‌..

కరోనాపై ఎన్నెన్నో కథనాలు.. ఎన్నో పుకార్లు