భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్కడేమో రోగులు.. ఇక్కడేమో ప్రయాణికులు.. బిక్కు బిక్కుమంటూ భయంతో ఉంటున్నారు. కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పటల్(జీజీహెచ్), బస్టాండ్‌లోని పైకప్పు పెచ్చులు తరుచూ ఊడి పడుతున్నాయి. ఇటీవల వానలకు బస్టాండ్ స్లాబ్ లీకేజీ అవుతోంది.
ఎక్కడ జారి పడిపోతామోనని, ఎప్పుడు పై కప్పు పెచ్చులూడి పైన పడుతాయోనని ప్రయాణికులు భయపడుతున్నారు. బస్టాండ్‌తో పాటు, జీజీహెచ్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తో పాటు సంబంధిత అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప శాశ్వతంగా రిపేర్లు చేయడం లేదు. ఇప్పటికైనా రిపేర్లు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.