IND vs ENG, 1st Test: భారత్‌కు భారీ ఆధిక్యం.. పట్టు బిగించిన రోహిత్ సేన

IND vs ENG, 1st Test: భారత్‌కు భారీ ఆధిక్యం.. పట్టు బిగించిన రోహిత్ సేన

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా భారత్ భారీ ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టును 246 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా..ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. 7 వికెట్లకు 421 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ సేన 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో 190 పరుగుల ఆధిక్యం లభించింది. పిచ్ పై బంతి గింగరాలు తిరుగు తుండడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఎలా బ్యాటింగ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

జడేజా సెంచరీ మిస్ 

మూడో రోజు ఆటలో భాగంగా అందరి దృష్టి జడేజా మీదే ఉంది. ఓవర్ నైట్ 81 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఈ స్టార్ ఆల్ రౌండర్ సెంచరీ కొడతాడని ఇండియన్ ఫ్యాన్స్ ఆశించారు. అయితే జడేజా మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు. తర్వాత బంతికే బుమ్రా గోల్డెన్ డకౌట్.. చివరి వికెట్ గా అక్షర్ పటేల్ వెనుదిరిగారు. దీంతో 15 పరుగులకే భారత్ తమ చివరి మూడు వికెట్లను కోల్పోయింది.  

ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 4 వికెట్లు తీసుకున్నాడు. రెహన్ అహ్మద్, హార్ట్లీ చెరో రెండు వికెట్లు దక్కగా.. లీచ్ కు ఒక వికెట్ లభించింది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే భారత బ్యాటర్లు జైస్వాల్ (80), రాహల్(86) సెంచరీలు మిస్ అయ్యారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ స్టోక్స్ 70 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది.