- కొన్నేండ్లుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు
- బోధన్ లో ఐసిస్, పీఎఫ్ఐ కార్యకలాపాలు
- తాజాగా ఎన్ఐఏ సోదాల్లో కీలక పత్రాలు లభ్యం
- పీఎఫ్ఐ సభ్యుడి అరెస్ట్ తో జిల్లాలో అలర్ట్
నిజామాబాద్, వెలుగు: ఇందూరు జిల్లాలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో ఆదివారం ఎన్ఐఏ జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించడంతో పీఎఫ్ఐ సభ్యుడైన నిజామాబాద్ యువకుడిని అరెస్ట్ చేశారు. గతంలో ఐసిస్ కార్యకలాపాలతో ప్రమేయం ఉందని పోలీసులు బోధన్‌లో గాలింపు చేపట్టారు. ఏడాది తర్వాత ఇప్పుడు పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగుచూడడం సంచలనం కలిగిస్తోంది. బంగ్లాదేశ్ వాసులు బోధన్ అడ్రస్‌తో పాస్ పోర్టులు తీసుకున్న ఘటన మరవకముందే మరో ఉగ్ర కదలికలతో జిల్లాతోపాటు నార్త్తెలంగాణలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో ఉగ్రమూలాలు
నార్త్ తెలంగాణతోపాటు నిజామాబాద్జిల్లాలో 20 ఏండ్ల కిందనే ఉగ్రమూలాలు బయటపడ్డాయి. కరుడు గట్టిన ఉగ్రవాదులు, స్లీపర్‌సెల్స్ నిజామాబాద్ జిల్లాలో ఆశ్రయం పొందిన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు ఇక్కడి నుంచి సహకారం లభించినట్లు గతంలో ఆధారాలు బయటపడ్డాయి. కరుడు గట్టిన ఐఎస్ఐ ఉగ్రవాది ఆజాం ఘోరిని జగిత్యాల పట్టణంలో ఏప్రిల్ 6, 2000న పోలీసులు ఎన్కౌంటర్లో మట్టుపెట్టారు. 2002లో నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ లో ఐఏస్ఐ టెర్రరిస్ట్ అన్వర్ ను, 2010 లో భైంసాలో ఓ ఐఏస్ఐ ఉగ్రవాది అరెస్ట్ అయ్యారు.
2015లో బాసర రైల్వేస్టేషన్లో నిషేధిత సంస్థకు చెందిన 20 మంది కార్యకర్తలు, 2018లో నిజామాబాద్ లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు చెందిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. మరోవైపు బోధన్ కేంద్రంగా బంగ్లాదేశ్ వాసులకు అక్రమంగా పాస్‌పోర్టుల వ్యవహారం బయటికి వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యాలకు ఒకే అడ్రస్‌పై 72 పాస్ పోర్టులు జారీ చేయడం.. ఎస్బీ పోలీసులు వాటికి క్లీన్‌చీట్ ఇవ్వడం అప్పట్లో రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో బోధన్ అడ్రస్‌తో పాస్ పోర్టు పొంది బంగ్లాదేశ్ కు వెళ్లిపోయారు. మరో ఇద్దరు ఇదే తరహాలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా హైదరాబాద్ఎయిర్పోర్ట్లో పట్టుబడడంతో అక్రమ పాస్ పోర్ట్ ల వ్యవహారం బయటకు వచ్చింది. బోధన్ రోహింగ్యాల పాస్ పోర్టు కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు.
నిఘా వైఫల్యమేనా..
నార్త్తెలంగాణలో ఉగ్ర కార్యకలాపాల నేపథ్యంలో పోలీస్ శాఖ నిఘా వైఫల్యం కనిపిస్తోంది. పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆదేశాలతో జులై 4న ముగ్గురు బాధ్యులపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజా ఘటనలో ఎన్ఐఏ నేరుగా రంగంలోకి దిగేంతవరకు స్టేట్పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం.