దర్శకుడిగా బెస్ట్ కెరీర్ ఊహించుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చానంటున్నాడు విక్రమ్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి లీడ్ రోల్స్‌లో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్, కామెడీ, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సినిమా ఉంటుంది.
ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తరువాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది. లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏమిటి అనేది సినిమా. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇది. సినిమాలోని పతాక సన్నివేశాలు పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. యూత్‌తో పాటు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇప్పటికే వేసిన ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా ఒక్కరైనా బాగా లేదు అంటే నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తా. కానీ రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. థియేటర్స్ లేకపోవడం వల్ల పలుసార్లు విడుదల తేదీ మార్చాం. సినిమా రైట్స్ తీసుకున్న ఈటీవి వీన్ వాళ్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన సలహాతోనే డేట్స్ మార్చాం. ఇక నా కథలు చాలా పెద్దవి. నా కెరీర్లో బెస్ట్ సినిమా ఊహించుకుని కెరీర్‌ను స్టార్ చేశా. చిరంజీవి, రామ్‌చరణ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలి అది నా అల్టిమేట్ గోల్. దాని కోసం కష్టపడతా. వాళ్లిద్దరి కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉంది’ అని చెప్పాడు.