![సికింద్రాబాద్లో అమ్ముతుంది కుళ్లిన చికెనా..? రెండు చికెన్ సెంటర్స్లో 5 క్వింటాళ్లు సీజ్](https://static.v6velugu.com/uploads/2025/02/rotten-chicken-seized-in-surprise-raid-at-anna-nagar-rasoolpura-secunderabad_oxc1XdBDYu.jpg)
సికింద్రాబాద్: అసలే బర్డ్ ఫ్లూ భయంతో జనం బెంబేలెత్తిపోతుంటే కొందరు చికెన్ సెంటర్ యజమానులు కాసుల కక్కుర్తితో కుళ్లిన చికెన్ అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఈ గలీజు దందాకు తెరతీశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. రెండు షాపుల్లో తనిఖీలు చేయగా సుమారు ఐదు క్వింటాళ్ల కుళ్ళిన చికెన్ కనిపించింది. అధికారులు ఈ కుళ్లిన చికెన్ను సీజ్ చేశారు.
కెమికల్స్, మసాలాలు కలిపి నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్థానిక నాయకులు పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. ఎన్ని సార్లు దాడులు చేసి సీజ్ చేసి కేసులు పెట్టినా ప్లేసులు మారుస్తూ కుళ్ళిన చికెన్ అమ్ముతూ ప్రజల ప్రాణాలతో కొందరు వ్యాపారులు చెలగాటం ఆడుతున్నారు. కుళ్ళిన చికెన్ను తక్కువ ధరకు వైన్స్ పర్మిట్ షాపులకు, కల్లు దుకాణాలకు, బార్లకు సప్లయ్ చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది.
2024, అక్టోబర్ లో కూడా బేగంపేట ప్రకాష్ నగర్ లో ఈ కుళ్లిన చికెన్ దందా బయటపడింది. 7 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీకి చెందిన ఆహార భద్రతా విభాగం అధికారులు ప్రకాశ్ నగర్లోని బాలయ్య చికెన్ సెంటర్లో తనిఖీలు చేయగా ఈ నిజం వెలుగులోకి వచ్చింది. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బేగంపేటప్రకాశ్నగర్కు చెందిన బాలయ్య (36) 2024, అక్టోబర్ నాటికి.. పది నెలల క్రితం అదే ప్రాంతంలో బాలయ్య చికెన్సెంటర్పేరుతో షాపు ఓపెన్ చేశాడు.
ALSO READ | ఏపీలో మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్..కలెక్టర్ ఏమన్నారంటే.?
కోడి కాళ్లు, తల, ఇతర భాగాలను సేకరించి తన షాపులోని ఫ్రిజ్లో భద్రపరుస్తున్నాడు. అలా దాచిన చికెన్ను సిటీలోని బార్లు, కల్లు దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అమ్ముతున్నాడు. నెల రోజుల క్రితం సేకరించి దాచిపెట్టిన చికెన్, ఎముకలు, తల, ఇతర భాగాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదంతా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆ మాంసానికి కెమికల్స్వేసి వివిధ దుకాణాలకు అమ్ముతున్నాడని అధికారులు గుర్తించారు.