మార్టుల్లో కుళ్లిన ఫ్రూట్స్.. ఔట్ డేటెడ్ స్నాక్స్​

  • మార్టుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు
  • ఎక్స్​పైరీ ముగిసినా, కుళ్లిన వాటినే విక్రయిస్తున్న వైనం
  • మామూళ్ల మత్తులో ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లు!

వరంగల్​, వెలుగు: ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్ల పట్టింపులేని కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. వరంగల్ సిటీలో వెలసిన కొన్ని హోటళ్లు, మార్టులు కాలం చెల్లిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు మామూళ్ల మత్తులో ఊగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని మాల్స్​, మార్ట్​ లు తమ సొంత లేబుళ్లతో ప్యాకెట్లు తయారు చేసి ఎక్స్​పైరీ డేట్ లేకుండానే అమ్ముతున్నాయి. తేదీలను స్టిక్కర్ల రూపంలో అతికించి, కాలం చెల్లిన తరువాత మళ్లీ ఫ్రెష్​ స్టిక్కర్లు వేసి నడిపిస్తున్నాయి.

తనిఖీల్లేవు..

సిటీలో ఉన్న హోటళ్లు, దుకాణాలు, వివిధ స్టోర్స్​, మాల్స్ లో ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లు తరచూ తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐస్​ క్రీమ్స్​, కూల్​ డ్రింక్స్​, బ్రెడ్​, మిల్స్​, ఫ్రూట్స్​, ఇతర ఫుడ్​ ప్రొడక్ట్స్​ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ నగరంలో వెలసిన కొన్ని మార్ట్​లు  ప్రజల ఆరోగ్యం కంటే బిజినెస్​కే ప్రాధాన్యం ఇస్తూ  ఫుడ్​ ప్రొడక్ట్స్​ గడువు ముగిసినా వాటిని తొలగించకుండా విక్రయిస్తున్నాయి. బాధితుల కంప్లైంట్​ మేరకు ఇటీవల వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఆయా స్టోర్​ లలో నిత్యావసర సరకులతో పాటు ఫుడ్​ ఐటమ్స్​కు సంబంధించిన ఎక్స్​పైరీ డేట్​ ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని తొలగించాల్సిన యాజమాన్యాలు అదేమీ పట్టించుకోవడం లేదు. ఇక్కడి ఆఫీసర్లు అన్నీ తెలిసినా లైట్​ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా కంప్లయింట్ చేస్తే తనిఖీల పేరున హడావుడి చేసి దుకాణదారులకు ఎంతోకొంత ఫైన్​ వేసి చేతులు దులుపేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

హోటళ్ల వైపు అసలే చూడట్లే..

నగరంలోని బడా హోటళ్లవైపు ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లు చూడరనే అపవాదు ఉంది. హోటళ్లలో ఫిష్​, చికెన్​, మటన్​ బిర్యానీలు, ఇతర వెరైటీలు స్టోర్​ చేసి అమ్ముతున్నా పట్టించుకోవడం లేదు. అప్పట్లో మున్సిపల్​ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి ఫైన్లు విధించారు. కానీ ఇప్పటికీ కొన్ని హోటళ్ల తీరు అలాగే కొనసాగుతోంది. సంబంధిత ఆఫీసర్లు  మాత్రం తనిఖీలు విస్మరించి కుర్చీలకే అతుక్కుపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్ వరంగల్​ పరిధిలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది.

సొంత లేబుల్స్​.. స్టిక్కర్స్​

గ్రేటర్​ వరంగల్​ పరిధిలో అన్నీ కలిపి దాదాపు 200 వరకు మార్ట్​ లు ఉన్నాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇలా అన్నీ ఓకే చోట లభిస్తుండడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. దీంతో కొన్ని మార్ట్​లు సొంతంగా ఫుడ్​ ప్రొడక్ట్స్​ తయారు చేస్తున్నాయి. కానీ వాటిపై తయారీ, ఎక్స్​పైరీ డేట్ మాత్రం ముద్రించడం లేదు. ఎవరైనా తనిఖీలకు వస్తే ప్యాకెట్లపై అంటించడానికి స్టిక్కర్లను రెడీగా పెట్టుకుంటున్నాయి. ఇంకొన్నింటిపై కేవలం ఎంఎఫ్​జీ, ఎక్స్​పైరీ డేట్​ స్టిక్కర్లు తయారు చేసి అతికిస్తున్నారు. తీరా ఆ ఫుడ్​ ప్రొడక్ట్స్​ డేట్​ ముగుస్తుందనగా.. దానిని తొలగించి కొత్త తేదీలతో స్టిక్కర్లు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో  కోడిగుడ్లు, పండ్లు, బ్రెడ్​ తదితర గ్రాసరీస్​ ఆఫర్లు పెట్టి ప్రజలకు అంటగడుతున్నాయి. ఇవేమీ తెలియని అమాయక ప్రజలు వాటినే కొనుగోలు చేస్తున్నారు.

జనవరి 20న కాజీపేటలోని ఓ మార్ట్​ ఔట్ డేటెడ్​బిస్కెట్​ప్యాకెట్లు, ఇతర స్నాక్స్ అమ్ముతుండడంతో కొనుగోలుదారులు మున్సిపల్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రూ.20 వేల ఫైన్ విధించారు.

హన్మకొండ బాలసముద్రంలోని స్మార్ట్ స్టోర్​లో ఓ వ్యక్తి గతేడాది డిసెంబర్​ 15న కుళ్లిపోయిన యాపిల్స్ విక్రయించాడు. గుర్తించిన బాధితుడు మున్సిపల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో మున్సిపల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజారెడ్డి.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సమక్షంలో తనిఖీలు చేపట్టి ఆ స్టోర్​కు రూ.20 వేల ఫైన్​ వేశారు.

For More News..

పీపీఈ కిట్ లో వచ్చి రూ.13 కోట్ల బంగారం కొట్టేసిన దొంగ

అమెరికా ఫస్ట్ లేడీస్ అందరూ ఆ రంగు బట్టలే ఎందుకు వేసుకుంటారో తెలుసా? 

బైడెన్‌ ఫాలో అయ్యే ఒకే ఒక్క సెలబ్రిటీ.. ఎవరు, ఎందుకో తెలుసా?