
కమ్యూనల్ అవార్డ్: రెండో రౌండ్ టేబుల్ ముగిసిన నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాన రామ్ సే మక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 16న బ్రిటిష్ పార్లమెంట్లో కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. దీని సారాంశం భారతీయులు ఒక జాతికి చెందిన వారు కాదు. వారు అనేక అల్పసంఖ్యాక వర్గాల సముదాయం మాత్రమే. అందువల్ల దీనిద్వారా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లతో సహా దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. బెంగాల్, పంజాబ్‌ల్లో ముస్లింలు అధిక సంఖ్యాకులు కావడంతో ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. వాయవ్య సరిహద్దు రాష్ట్రం మినహా మిగిలిన ప్రాంతాల్లో 3శాతం సీట్లను స్త్రీలకు కేటాయించారు. దళితులు అల్పసంఖ్యాక వర్గాలుగా పరిగణించబడ్డారు. దేశం మొత్తం మీద వారికి 71 సీట్లు కేటాయించారు. అయితే వారికి సాధారణ నియోజకవర్గాల్లో కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. భూస్వాములకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. అయితే ఈ అవార్డు కేవలం రాష్ట్ర శాసనసభలకు మాత్రమే వర్తిస్తుంది.
స్వాతంత్ర్య సంగ్రామంలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. మొత్తం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరగ్గా రెండో సమావేశానికి మాత్రమే కాంగ్రెస్ హాజరైంది. కానీ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు ప్రస్తావనతో అర్ధాంతరంగా నిష్క్రమించింది. ఆ తర్వాత కమ్యూనల్ అవార్డు ప్రకటన, మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షతో పూనా ఒప్పందం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నూతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి దేశంలోని అన్ని పక్షాల వారితో చర్చించడానికి బ్రిటిష్ లేబర్ ప్రభుత్వం లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఇది మూడు ప్లీనరీలను ఏర్పాటు చేసింది. వీటిని మొదటి, రెండో, మూడో రౌండ్ టేబుల్ సమావేశాలుగా చరిత్రలో ప్రఖ్యాతిగాంచాయి.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగాయి. బ్రిటన్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలైన లేబర్, కన్సర్వేటివ్, లిబరల్ పార్టీల తరఫున 16 మంది హాజరయ్యారు. బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది( వైస్రాయ్ నామినేట్ చేశారు), స్వదేశీ సంస్థానాల నుంచి 16 మంది హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బహిష్కరించింది.
ప్రశ్న: కింది వానిలో దేనికి వ్యతిరేకంగా 1932, సెప్టెంబర్ 20న మహాత్మాగాంధీ ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు? (1)
ఎ. రామ్ సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు వల్ల
బి. సత్యాగ్రహిలను బ్రిటిష్ వారు అణచివేయడం వల్ల
సి. గాంధీ ఇర్విన్ పాక్ట్ ఉల్లంఘించడం వల్ల
డి. కలకత్తాలో కమ్యూనల్ కలహాల వల్ల
లిబరల్ పార్టీ నుంచి తేజ్‌బహదూర్ సప్రూ, వి.ఎస్.శ్రీనివాస శాస్త్రి, ఎం.ఆర్.జయకర్, సి.వై.చింతామణి, ముస్లింలీగ్ తరఫున ఆగాఖాన్. మహమ్మద్ షఫీ, మహమ్మదాలీ, ఫజల్ ఉల్ హక్, మహమ్మదాలీ జిన్నా సిక్కుల తరఫున సంపూరణ్‌సింగ్, హిందూ మహాసభ తరఫున బి.ఎస్.మూంజే, దళితుల పక్షాలన అంబేద్కర్, బ్రిటిష్ వ్యాపార వర్గం నుంచి సర్ హ్యూబర్డ్ వింబ్కార్, ఆంగ్లోఇండియన్‌ల నుంచి హెచ్.ఎ.జె.గిడ్ని పాల్గొన్నారు. స్వదేశీ సంస్థానాల తరఫున ఆల్వార్, బరోడా, బికనీర్, కశ్మీర్, పాటియాలా సంస్థానాధీశులు హాజరయ్యారు. హైదరాబాద్ సంస్థానం నుంచి సర్ అక్బర్ హైదరీ, మైసూర్ తరఫున సర్ మీర్జా మహ్మద్ ఇస్మాయిల్, గ్వాలియర్ తరఫున కల్నల్ కె.ఎన్.హక్సన్ హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కార్యనిర్వాహకశాఖ, శాసస నిర్మాణ శాఖకు బాధ్యత వహించేటట్లు నూతన రాజ్యాంగం ఉండాలని నిర్ణయించారు. అయితే దేశంలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ హాజరుకాకపోవడంతో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైంది.
ప్రశ్న: బ్రిటిష్ ప్రభుత్వం మొదటి రౌండ్ టేబుల్ సమావేశం దేనికోసం ఏర్పాటు చేసింది? (డి)
ఎ. దేశ విభజనపై తుది నిర్ణయం తీసుకోవడానికి
బి. గాంధీతో ఒడంబడిక పై సంతకం చేయడానికి
సి. నెహ్రూ నివేదికపై చర్చించడానికి
డి. సైమన్ కమిషన్ నివేదికపై చర్చించడానికి
రెండో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుంచి 1931 డిసెంబర్ 1 వరకు జరిగింది. గాంధీ, ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా ఈ సమావేశానికి మహాత్మాగాంధీ హాజరయ్యారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో అదనంగా మహాత్మా గాంధీ (కాంగ్రెస్), సర్ మహ్మద్ ఇక్బాల్ (ఉర్దూకవి), ఎస్.కె.దత్తా(భారతీయ క్రైస్తవుడు), జి.డి.బిర్లా(వణిక్ ప్రముఖుడు), మదన్ మోహన్ మాలవీయ (హిందూ మహాసభ), సరోజినీ నాయుడు, అలీ ఇమాం పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతి, వర్గ అంశాలు చర్చకు వచ్చాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు ప్రస్తావనను మహాత్మాగాందీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అయినా ప్రభుత్వం దళితుల వైపే మొగ్గు చూపింది. గాంధీ నిరాశతో భారతదేశం చేరుకున్నారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశం, జాతి, వర్గం సమస్యలను పరిష్కరించలేకపోయినప్పటికీ నూతన రాజ్యాంగం ఏర్పాటు దశగా కొన్ని అడుగులు వేసింది. ఫెడరల్ న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వనరుల పంపకాన్ని ఇది చర్చించింది. ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం మీద ఒక సబ్ కమిటీ, మైనారిటీస్ మీద మరో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.
ప్రశ్న మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది? (డి)
ఎ. మహాత్మా గాంధీ
బి. సరోజినీ నాయుడు
సి. మదన్ మోహన్ మాలవీయ
డి. బి.ఆర్.అంబేద్కర్
ప్రశ్న: మహాత్మా గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? (డి)
ఎ. 1917 బి. 1920 సి. 1930 డి. 1940
మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1932 నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగింది. 46 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నూతన రాజ్యాంగ నిర్మాణానికి తుది అడుగులు పడ్డాయి. ఇందులో ప్రతిపాదనలను లార్డ్ లిన్లిత్గో చైర్మన్‌గా గల జాయింట్ సెలెక్ట్ కమిటీకి నివేదించబడ్డాయి. జాయింట్ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత్ ప్రభుత్వ చట్టం – 1935 రూపుదిద్దుకుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ హాజరుకాకపోవడంతో పరిస్థితిని మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో పూర్ణ స్వరాజ్‌ను కోరుతున్న దేశ ప్రజలకు అధినివేశ ప్రతిపత్తిని కూడా ఇవ్వని భారత ప్రభుత్వ చట్టం – 1935 రూపొందింది. బి.ఆర్.అంబేద్కర్ మాత్రమే మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు..
పూనా ఒప్పందం: కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ పూనాలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించారు. అయితే గాంధీ, అంబేద్కర్ల మధ్య మధ్యవర్తిగా మదన్ మోహన్ మాలవీయ వ్యవహరించి చర్చలు జరిపి ఇద్దరి మధ్య పూనా ఒప్పందం కుదుర్చాడు. దీని ద్వారా దళితులకు కేటాయించిన 71 స్థానాలను 148కి పెంచారు. శాసనసభల్లో దళిత ప్రతినిధులను రెండు స్థాయిల్లో ఎన్నుకుంటారు. మొదటి స్థాయిలో దళితులు మాత్రమే వారికి కేటాయించిన ఒక్కొక్క స్థానానికి నలుగురు దళితులను ఎన్నుకుంటారు. రెండో స్థాయిలో ఆ నలుగురి నుంచి ఒక్కరిని దళితులు మిగిలిన హిందువులతో కలిసి ఎన్నుకుంటారు.