బీసీలకు అన్యాయం జరిగితే సహించం: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

బీసీలకు అన్యాయం జరిగితే సహించం: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
  • కులగణన పూర్తయ్యే దాకా అప్రమత్తంగా ఉండాలి: చిరంజీవులు
  • టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీని గెలిపించాలి: తీన్మార్ మల్లన్న
  • బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్‌‌

హైదరాబాద్, వెలుగు: కులగణనపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఆహ్వానిస్తున్నామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. కులగణనను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసే వరకు బీసీ సంఘాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌‌ హబ్సిగూడలోని ఓ హోటల్‌‌లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్‌‌కు చిరంజీవులు అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వెబ్‌‌సైట్‌‌ www.bcif.inను ఆయన ఆవిష్కరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చిరంజీవులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ వెబ్‌‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న బీసీ నాయకులకు బీసీల సమస్యలపై శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 4 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. 

బీసీలు అప్రమత్తంగా ఉండాలి.. 

ప్రభుత్వం ఇచ్చిన కులగణన జీవోతో మనం సంతృప్తి చెందకుండా, అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదులను గెలిపించుకునేలా బీసీలంతా ఏకం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కులగణన చేసి, ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌‌ డిమాండ్ చేశారు. గత కొన్నేండ్లుగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. బీసీ ఉద్యమాన్ని అన్ని రంగాల్లో ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎర్ర సత్యనారాయణ, చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.