క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్​ సమావేశం.. హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నం

హైదరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శుభ పరిణామం అని.. ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్​లో నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నామని వక్తలు పేర్కొన్నారు.  రిజర్వాయర్లు, చెరువులు, నాలాలపై ఆక్రమణలను తొలగించి, వాటన్నింటినీ రీస్టోర్​ చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్​లోని సోమాజిగూడ  ప్రెస్​క్లబ్​లో ​లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో ‘క్లైమేట్​ కాంగ్రెస్’​ పేరుతో రౌండ్​​టేబుల్ ​సమావేశం నిర్వహించారు. 

సిటీ పరిధిలో ఆక్రమణకు గురైన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలపై పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లుబ్నా సర్వత్​మాట్లాడుతూ..హైదరాబాద్ నగరంలో రెండు రిజర్వాయర్లు, వందలాది చెరువులు, కుంటలు, నాలాలు ఉన్నాయని, వాటిని కాపాడుకుంటే మున్మందు నీటి కష్టాలే ఉండబోవని తెలిపారు. ఆక్రమణల వల్లే ప్రస్తుతం వర్షకాలం వరదలు, ఎండాకాలం నీటి ఎద్దటి ఎదుర్కొంటున్నామని చెప్పారు. 

హైడ్రా అన్ని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసి, చెరువులకు పూర్వస్థితిని తీసుకురావాలని కోరారు. బల్వపూర్​నాలా, ఫిరంగి నాలా హైడ్రాలాజికల్​ సిస్టమ్​ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఉస్మాన్​ సాగర్ మొత్తం 6,300 ఎకరాల్లో విస్తరించి ఉన్నదని ఆర్టీఐ ద్వారా వెల్లడించారని, కానీ, హెచ్​ఎండీఏ వెబ్​సైట్​లో మాత్రం 6 వేల ఎకరాలే ఉన్నట్టు పేర్కొన్నారని తెలిపారు. చెరువుల ఆక్రమణపై కోర్టుల్లో 14 కేసులు ఉన్నాయని, వాటిని హైడ్రా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వాటిపై చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. 

అలాగే, హుస్సేన్​సాగర్​లో 10 ఎకరాల మేర కబ్జాకు గురైందని తెలిపారు. ప్రస్తుతం ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తున్నదని చెప్పారు. అక్రమార్కులపై కూడా చర్యలు తీసుకునే విధంగా హైడ్రా ముందుకు పోవాలని కోరారు. చెరువులు కాలుష్యబరితంగా మారుతున్నాయని, వాటి కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని మరో వక్త అక్షయ్​ దేశ్​ పాండే అన్నారు. 

50 ఎకరాలున్న బండ్లగూడ చెరువు 30 ఎకరాలకు చేరిందని ఆ ప్రాంతానికి చెందిన ప్రమీల పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్​లేక్​ ను కాపాడాలని హైడ్రాను కోరారు. చాంద్రాయణ గుట్ట బార్కస్​ మధ్యలో గుర్రం చెరువు కబ్జాకు గురైందని, ప్రభుత్వం దానిని కాపాడాలని సోషల్​యాక్టివిస్ట్​ ప్రసన్నకుమార్​ రెడ్డి అన్నారు.

బల్కాపూర్​లో తక్షణం కూల్చేసే నిర్మాణాలున్నయ్​

ఉస్మాన్​సాగర్ ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్ లో​ అక్రమ నిర్మాణా లున్నాయి. ప్రస్తుతం జన్వాడ 311 సర్వే నంబర్​ హాట్​ టాపిక్​ గా మారింది. ఆ సర్వే నంబర్​లోకి వెళ్లేందుకు బల్కాపూర్ నాలాపై రోడ్డు వేశారు. నాలాపై గేటును ఏర్పాటు చేసి, 311 సర్వే నంబర్ లోకి వెళ్తున్నారు. మామసానికుంట, మేకసానికుంట, బల్కాపూర్​ నాలా.. మొత్తం కబ్జాకు గురయ్యాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటే అధికారులు భయపడుతున్నారు. 
- లుబ్నా సర్వత్​, సోషల్ యాక్టివిస్ట్