సప్లిమెంటరీ చార్జ్​షీట్​పై విచారణ మళ్లీ వాయిదా : రౌస్ అవెన్యూ కోర్టు

సప్లిమెంటరీ చార్జ్​షీట్​పై విచారణ మళ్లీ వాయిదా :  రౌస్ అవెన్యూ కోర్టు
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  కోర్టు ముందు హాజరైన కవిత

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్​షీట్​పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్ షీట్ లోని కొన్ని పేజీలను తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి అనువదించి ఇవ్వాలని సీబీఐ అధికారులను గతంలో కోర్టు ఆదేశించింది. అయితే, తిరిగి అవే కాపీలను దర్యాప్తు సంస్థ నిందితులకు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేస్తున్నట్టు ట్రయల్ కోర్టు వెల్లడించింది. ఈ కేసు వ్యవహారంలో జూన్ 7న కవితతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ చార్జ్​షీట్ దాఖలు చేసింది. 

దీన్ని జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. అంతకు ముందు మనీశ్ సిసోడియా తదితరులపై సీబీఐ అడిషనల్ చార్జ్​షీట్ వేసింది. ఈ చార్జ్​షీట్లపై బుధవారం సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు. కవితతో పాటు ఈ కేసులోని సుమారు 40 మంది సహ నిందితులు వర్చువల్ మోడ్ లో కోర్టు ముందు హాజరయ్యారు. చార్జ్​షీట్​లో పలు పేజీలు స్పష్టంగా లేని విషయాన్ని కవిత తరఫు లాయర్ మోహిత్ రావు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ప్రతివాదులడిగిన కాపీలు ఇవ్వాలని సీబీఐని జడ్జి ఆదేశించారు. ఇదే చివరి అవకాశమని చెప్పారు.