న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్ షీట్ లో పలు పేజీల మిస్సింగ్, ఖాళీలపై ప్రతివాదులు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి ఇవ్వాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్టు ట్రయల్ కోర్టు వెల్లడించింది. ఈ కేసు వ్యవహారంలో గతేడాది జూన్ 7న కవితతో పాటు, మరో నలుగురిపై సీబీఐ సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ చార్జ్ షీట్ ను జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అమన్ డీప్ దళ్, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రుపై సీబీఐ అదనపు చార్జ్ షీట్ వేసింది. ఈ చార్జ్ షీట్లపై శుక్రవారం మరోసారి సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కవితతో పాటు, కేజ్రీవాల్, సిసోడియా, ఇతర సహ నిందితులు వర్చువల్ మోడ్ లో కోర్టు ముందు హాజరయ్యారు. సీబీఐ చార్జ్ షీట్ లో స్పష్టంగా లేని పలు పేజీల విషయాన్ని నిందితుల తరఫు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో కోరినప్పటికీ.. దర్యాప్తు సంస్థలు మరోసారి పాత కాపీలే సర్వ్ చేశాయని నివేదించారు.
ఇందులో చాలా పేజీల్లో అక్షరాలు నల్లగా, స్పష్టంగా లేవని, ఖాళీలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గతంలో కోర్టు ఆదేశించినా.. సీబీఐ అధికారులు కొత్త కాపీలు అందించలేదని తెలిపారు. ఇందుకు సీబీఐ అధికారులు స్పందిస్తూ.. మరోసారి అప్ డేట్ చేసిన కాపీలు అందజేస్తామని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రతివాదులు అడిగినట్టు స్పష్టతతో కూడిన కాపీలను సప్లై చేయాలని స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. సీబీఐని ఆదేశించారు. కాగా, సీబీఐ సర్వ్ చేసిన కాగితాల్లో స్పష్టత లేకపోవడంతో గత మూడు నెలలుగా కేసు వాయిదా పడుతూ వస్తోంది.