హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్పై ఇన్నాళ్లు విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో.. కేటీఆర్ను విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు మార్గం సుగమమైంది. ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడం, చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించడంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవక తప్పని పరిస్థితులున్నాయి. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఏసీబీ, ఈడీ ఇలా ముందుకు:
* KTR అరెస్ట్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు
* కోర్టు తీర్పుతో దూకుడు పెంచనున్న ACB
* విచారణకు రావాలంటూ ఇప్పటికే మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
* హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్న ఈడీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.
దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో ఏసీబీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన నిధులు.. ఏ అకౌంట్స్ లోకి చేరాయనేది కూడా గుర్తించింది.
Also Read : ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారు. 2023 అక్టోబర్ 3, 11వ తేదీల్లో హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి రూ.45.71 కోట్లు లండన్‌లోని ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు తరలించారు. ఇందుకు గాను ఆర్బీఐ రూల్స్ పాటించనందున హెచ్‌ఎండీఏ రూ.8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది.
దీంతో పాటు ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఐఏ)కు రూ.1.10 కోట్లు చెల్లించారు. ఇలా మొత్తం రూ.54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి మంత్రి కేటీఆర్ దుర్వియోగం చేశారని ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు,హెచ్‌ఎండీఏ రికార్డులను ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు. అగ్రిమెంట్లు, నిధుల చెల్లింపుల డాక్యుమెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు.