- హై కోర్టు తీర్పుతో భూ సేకరణ స్పీడప్
- అలైన్ మెంట్ లోనూ మార్పు లేనట్లే
- త్రీడీ.. త్రీజీ నోటిఫికేషన్లకు ఆఫీసర్ల కసరత్తు
- ఐదు మండలాల్లో 1,794 ఎకరాలు సేకరణ
- నష్టపరిహారానికి త్వరలోనే ‘అవార్డు’ ఖరారు
యాదాద్రి, వెలుగు : రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్ ) భూ సేకరణకు యాదాద్రి జిల్లాలో రూట్ క్లియర్ అయింది. అలైన్మెంట్కు వ్యతిరేకంగా రాయగిరి రైతులు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఇక అలైన్మెంట్లో మార్పు లేనట్లేనని తేలింది. దీంతో అధికారులు భూ సేకరణను స్పీడప్ చేశారు. పెండింగ్లోని త్రీ డీ, త్రీ జీ నోటిఫికేషన్ల జారీకి రెడీ అయ్యారు. అనంతరం త్రీ హెచ్ నోటిఫికేషన్ జారీ చేసి పరిహార ‘అవార్డు’ కూడా ప్రకటిస్తారు. భారత్ మాల ప్రాజెక్ట్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మించే ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని 24 గ్రామాల మీదుగా వెళ్తుంది.
ఇక చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వైపు నిర్మించే దక్షిణ భాగానికి అదనపు భూమి సేకరణలో భాగంగా జిల్లాలో మొత్తంగా1,794 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందుకు అధికారులు మూడు ‘కాలా’లుగా విభజించారు. తుర్కపల్లి, యాదగిరిగుట్ట పరిధిలో సేకరించే 504.10 ఎకరాలకు త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేశారు. చౌటుప్పల్, వలిగొండ పరిధిలో సేకరించే 767.36 ఎకరాల్లో 556.01 ఎకరాలకు త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక పెండింగ్ లోని 211.35 ఎకరాలకు త్రీజీ నోటిఫికేషన్ కు అధికారులు రెడీ అయ్యారు. భువనగిరి మండల పరిధిలోని 491.1 ఎకరాల్లో 426 ఎకరాలకు త్రీడీ నోటిఫికేషన్ విడుదల చేయగా, పెండింగ్ లోని 64.8 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఈ నెలాఖరుకు త్రీడీ నోటీస్ విడుదల చేసే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. త్రీజీ నోటిఫికేషన్ మొత్తంగా జారీ చేయాల్సి ఉంది. త్రీజీ నోటిఫికేషన్ పరిధిలోని భూములు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు.
హైకోర్టును రైతులు ఆశ్రయించగా..
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు మొదటి నుంచి ట్రిపుల్ ఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూ సేకరణ సర్వేను కూడా పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. గత సర్కారులో మంత్రి జగదీశ్ రెడ్డిని అడ్డుకోగా రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అనంతరం రాయగిరి రైతులు గతేడాది హైకోర్టుకు వెళ్లారు. ఇప్పటికే పలుమార్లు అభివృద్ధి పనులకు తమ భూమిని కోల్పోయామని, ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చాలని పిటిషన్ లో కోరారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో భువనగిరి పరిధిలోని రాయగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, గౌస్ నగర్, ఎర్రంబెల్లిలో భూ సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కలెక్టర్లతో భేటీ అయిన సందర్భంగా ట్రిపుల్ ఆర్ భూ సేకరణ పరిహారంపై ఆఫీసర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని, భూములను శాశ్వతంగా కోల్పోయే రైతులను గుర్తించి, పిలిచి మాట్లాడి ఒప్పించాలని సూచించారు. హైకోర్టు విధించిన స్టే పై కలెక్టర్ హనుమంతు జెండగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. కేసు త్వరగా పరిష్కారమయ్యే విధంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అనంతరం వారం కింద రైతులు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
అలైన్ మెంట్ నో చేంజ్
రైతుల పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడంతో యాదాద్రి జిల్లాలో పాత అలైన్ మెంట్ నే ఉంటుందని తేలిపోయింది. దీంతో భూ సేకరణపై ఆఫీసర్లు ముందుకెళ్తున్నారు. భువనగిరి, చౌటుప్పల్ పరిధి పెండింగ్ లోని భూములకు త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఫైనల్ గా త్రీజీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కొంత సమయం పడు తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం త్రీ హెచ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మున్సిపాలిటీల్లో భూమి విలువకు రెండు రెట్లు, రూరల్ ప్రాంతాల్లో మూడు రెట్లు అవార్డు నిర్ణయించే ప్రక్రియను ప్రారంభిస్తామని చెబుతున్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్తాం
వివిధ అభివృద్ధి పనులకు గతంలో రాయగిరి నుంచి భూమి ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ ట్రిపుల్ ఆర్ కోసం తీసుకుంటున్నారు. భూ సేకరణపై మాకు అన్యాయం జరుగుతుంది. హైకోర్టులో మాకు న్యాయం లభించలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.
- తంగెళ్లపల్లి రవికుమార్,
ట్రిపుల్ ఆర్ లో భూమి కోల్పోతున్న వ్యక్తి