
హైదరాబాద్: రౌడీ షీటర్ అలీ బీన్ మహమూద్ జబ్రీ (32)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న మహమూద్ జబ్రీ.. చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం (మార్చి 4) పక్కా ప్లాన్ ప్రకారం టాస్క్‌ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడలోని ఇస్మాయిల్ నగర్‌కు చెందిన అలీ బీన్ మహమూద్ జబ్రీ ఫోర్జరీ, హత్యాయత్నం వంటి అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో భూ కబ్జా, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపులు, హత్యాయత్నంతో సహా 21 కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు సమాచారం. బండ్లగూడ, చంద్రాయణగుట్ట, కామాటిపుర, పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మహమూద్ జబ్రీపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. పలు కేసుల్లో మహమూద్ జబ్రీ జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
బెయిల్ మీద బయట ఉన్న జబ్రీ గత కొంతకాలంగా కోర్టు విచారణకు హాజరుకాకుండా పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్నాడు. దీంతో కోర్టు జబ్రీ బెయిల్ రద్దు చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పరారీలో ఉన్న జబ్రీపై పోలీసుల ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం (మార్చి 4) పక్కా వ్యూహం ప్రకారం టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ బృందం పోలీసులు జబ్రీని అరెస్ట్ చేసి ఆట కట్టించారు.