- పెర్రీ ఆల్‌రౌండ్ షో
- ముంబైపై గ్రాండ్ విక్టరీ
న్యూఢిల్లీ : తమ ఆఖరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొట్టింది. ఎలైస్ పెర్రీ (6/15; 38 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 నాటౌట్) రికార్డు బౌలింగ్, సూపర్ బ్యాటింగ్‌తో దుమ్మురేపడంతో.. డబ్ల్యూపీఎల్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. దీంతో 8 పాయింట్లతో మూడో ప్లేస్‌తో ప్లేఆఫ్స్ చేరింది. ఈ లీగ్‌లో ముంబైపై ఆర్‌సీబీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.
టాస్ ఓడిన ముంబై 19 ఓవర్లలో 113 రన్స్‌కే ఆలౌటైంది. సజన (21 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) టాప్ స్కోరర్. హేలీ మాథ్యూస్ (26), ప్రియాంక బాలా (19 నాటౌట్)తో సహా అందరూ ఫెయిలయ్యారు. తర్వాత బెంగళూరు 15 ఓవర్లలో 115/3 స్కోరు చేసి నెగ్గింది. పెర్రీకి తోడు రిచా ఘోష్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) సత్తా చాటింది. పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
పెర్రీ ‘సిక్సర్’
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై పవర్‌ప్లేలో బాగానే ఆడినా.. తర్వాత పేసర్ పెర్రీ దెబ్బకు కుప్పకూలింది. ఓపెనర్లు మాథ్యూస్, సజన చెరో ఫోర్‌తో ఖాతా తెరిచారు. మూడో ఓవర్లో 4, 6 కొట్టిన మాథ్యూస్ తర్వాతి ఓవర్లోనూ మరో సిక్స్‌తో బ్యాట్ ఝుళిపించింది. ఐదో ఓవర్లో సజన వరుసగా రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చింది. కానీ ఆరో ఓవర్ లాస్ట్ బాల్‌కు మాథ్యూస్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఈ దశలో బౌలింగ్‌కు వచ్చి పెర్రీ తొలి ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చింది. తర్వాతి తన 18 బాల్స్‌లో ఆరు వికెట్లు తీసి ముంబై స్కోరు బోర్డుకు కళ్లెం వేసింది. 8వ ఓవర్‌లో సజన 4, 4, 6తో 15 రన్స్ కొట్టగా, 9వ ఓవర్‌లో పెర్రీ వరుస బాల్స్‌లో సజన, హర్మన్‌ప్రీత్ (0)ను ఔట్ చేసింది. 10వ ఓవర్లలో 69/3 నిలిచిన ముంబైని బ్రంట్ (10) ఆదుకునే ప్రయత్నం చేసినా 11వ ఓవర్‌లో పెర్రీ మళ్లీ డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. తొలి మూడు బాల్స్‌లో అమెలియా కెర్ (2), అమన్‌జోత్ కౌర్ (4)ను పెవిలియన్‌కు పంపింది. 14వ ఓవర్‌లో చివరి నాలుగు బాల్స్‌లో వస్త్రాకర్ (6), బ్రంట్‌ను ఔట్ చేసింది. దీంతో ముంబై 82/7 స్కోరుతో నిలిచింది. చివర్లో ప్రియాంక నెమ్మదిగా ఆడినా రెండో ఎండ్‌లో సహకారం అందలేదు. వరుస విరామాల్లో హుమైరా (4), షబ్నిమ్ (8), సైకా (1)ను ఔట్ చేయడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమైంది.
కీలక భాగస్వామ్యం..
చిన్న టార్గెట్‌ను బెంగళూరు ఈజీగా ఛేజ్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (11), సోఫీ మొలినుక్స్ (9), సోఫీ డివైన్ (4) నిరాశపర్చినా.. ఎలైస్ పెర్రీ బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకుంది. పవర్‌ప్లేలో 39/3తో కష్టాల్లో పడిన ఆర్‌సీబీని రిచా ఘోష్‌తో కలిసి గట్టెక్కించింది. 9వ ఓవర్‌లో బ్రంట్ క్యాచ్ మిస్ చేయడంతో గట్టెక్కిన రిచా వేగంగా సింగిల్స్ తీయడంతో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టింది. దీంతో ఫస్ట్ టెన్‌లో ఆర్‌సీబీ 59/3తో నిలిచింది.
ఇక్కడి నుంచి పెర్రీ, రిచా పోటీపడి బౌండ్రీలు కొట్టారు. 11వ ఓవర్‌లో రిచా 4, 6తో రెచ్చిపోగా, ఆ వెంటనే పెర్రీ రెండు ఫోర్లతో చెలరేగింది. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 53 బాల్స్‌లోనే 76 రన్స్ జత కావడంతో ఆర్‌సీబీ 15 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 19 ఓవర్లలో 113 ఆలౌట్ (సజన 30, హేలీ మాథ్యూస్ 26, ఎలైస్ పెర్రీ 6/15). బెంగళూరు: 15 ఓవర్లలో 115/3 (పెర్రీ 40*, రిచా ఘోష్ 36*, మాథ్యూస్ 1/11).