- ఎలిమినేటర్‌లో 5 రన్స్ తేడాతో ముంబైపై గెలుపు
- చెలరేగిన పెర్రీ, బౌలర్లు
- హర్మన్, కెర్ పోరాటం వృథా
న్యూఢిల్లీ : చిన్న టార్గెట్‌ను అద్భుతంగా కాపాడుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ).. తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఎలైస్ పెర్రీ (50 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 66) మరోసారి చెలరేగడంతో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌లో 5 రన్స్ తేడాతో డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్‌కు చెక్ పెట్టింది. టాస్ నెగ్గిన ఆర్‌సీబీ తొలుత 20 ఓవర్లలో 135/6 స్కోరు చేసింది.
ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 130/6 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) టాప్ స్కోరర్. స్పిన్నర్ శ్రేయాంక (2/16) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. ఓ వికెట్ కూడా తీసిన పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీతో ఆర్‌సీబీ తలపడుతుంది.
పెర్రీ మినహా..
తొలి నాలుగు బాల్స్‌లో రెండు ఫోర్లతో మెరుపు ఆరంభాన్నిచ్చిన సోఫీ డివైన్ (10).. రెండో ఓవర్ లాస్ట్ బాల్‌కు ఔట్‌కాగా, ఇదే ఓవర్‌లో రెండో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన స్మృతి మంధాన (10) మూడో ఓవర్ రెండో బాల్‌కు వెనుదిరిగింది. మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔట్‌కావడంతో ఆర్‌సీబీ 20/2 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో పెర్రీ ఒంటరి పోరాటం చేసింది. నాలుగో ఓవర్లో దిశా (0) డకౌట్ కావడంతో ఒత్తిడి మరింత పెరిగింది. రిచా ఘోష్ (14) సింగిల్స్ తీయడంతో పవర్‌ప్లేలో బెంగళూరు 34/3 స్కోరుకే పరిమితమైంది.
8వ ఓవర్‌లో పెర్రీ 4, రిచా 6తో 13 రన్స్ రాబట్టారు.. కానీ హేలీ మాథ్యూస్ (2/18) బౌలింగ్‌లో రిచా వికెట్ ఇచ్చుకుంది. దాంతో సగం ఓవర్లకు ఆర్‌సీబీ 51/4 స్కోరుతో నిలిచింది. ఈ దశలో పెర్రీతో జత కలిసిన మొలినుక్స్ (11) స్ట్రయిక్ రొటేట్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయింది. పెర్రీ 6, 4తో జోరు చూపెట్టినా, 15వ ఓవర్‌లో మొలినుక్స్ వెనుదిరగడంతో ఐదో వికెట్‌కు 35 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది.
చివర్లో వారెహామ్ (18 నాటౌట్) మెరుగ్గా ఆడింది. పెర్రీ వరుస ఫోర్లతో 40 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసింది. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 26 బాల్స్‌లోనే 42 రన్స్ జోడించడంతో ఆర్‌సీబీ తేరుకుంది. కానీ చివరి ఓవర్‌లో పెర్రీ ఔట్ కాగా శ్రేయాంక (3 నాటౌట్)తో కలిసి వారెహామ్ 9 రన్స్ రాబట్టింది. ముంబై బౌలర్లలో బ్రంట్, సైకా చెరో రెండు వికెట్లు తీశారు.
బౌలర్లు అదుర్స్
ఛేజింగ్‌లో హేలీ మాథ్యూస్ (15), యాస్తిక భాటియా (19) తొలి వికెట్‌కు 27 రన్స్ జోడించి ముంబైకి మంచి ఆరంభమే ఇచ్చారు. హేలీ ఔటైన తర్వాత సివర్ బ్రంట్ (23) ఉన్నంతసేపు బ్యాట్ ఝుళిపించింది. పవర్‌ప్లే తర్వాత భాటియాతో కలిసి వేగంగా సింగిల్స్ తీస్తూ రన్‌రేట్ తగ్గకుండా చూసింది. రెండో వికెట్‌కు 23 రన్స్ జోడించిన తర్వాత భాటియా 8వ ఓవర్‌లో వెనుదిరిగింది. ఈదశలో హర్మన్‌ప్రీత్‌తో కలిసి బ్రంట్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. తొలి 10 ఓవర్లలో 60/2 స్కోరు చేసిన ముంబైకి 11వ ఓవర్లో షాక్ తాగిలింది.
ఈ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన బ్రంట్‌ను వారెహామ్ (1/37) ఔట్ చేసింది. ఇక్కడి నుంచి హర్మన్, అమెలియా కెర్ (27 నాటౌట్) నిలకడగా ఆడటంతో ముంబై 15 ఓవర్లలో 93/3తో నిలిచింది. ఇక 30 బాల్స్‌లో 43 రన్స్ చేయాల్సిన దశలో బెంగళూరు బౌలర్లు అద్భుతం చేశారు. కౌర్, కెర్ సింగిల్స్‌తో పాటు చెరో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచినా వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.
18 బాల్స్‌లో 20 రన్స్ అవసరమైన దశలో 18వ ఓవర్లో హర్మన్, తర్వాతి ఓవర్లో సజన (1) ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. చివరి ఓవర్లో ముంబైకి 12 రన్స్ అవసరం అవగా.. పూజా వస్త్రాకర్ (4)ను ఔట్ చేసి 6 రన్సే ఇచ్చిన వెటరన్ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన ఆర్‌సీబీని గెలిపించింది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు : 20 ఓవర్లలో 135/6 (పెర్రీ 66, వారెహామ్ 18*, మాథ్యూస్ 2/18, బ్రంట్ 2/18).
ముంబై : 20 ఓవర్లలో 130/6 (హర్మన్ 33, కెర్ 27, శ్రేయాంక పాటిల్ 2/16).