- ఆర్‌సీబీకి అందలం
- ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
- రాణించిన శ్రేయాంక, మొలినుక్స్, పెర్రీ
- మళ్లీ రన్నరప్‌తో సరిపెట్టిన డీసీ
ఆర్‌సీబీ.. ఐపీఎల్! ఈ రెండింటిని విడదీయలేం. ఐపీఎల్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న టీమ్స్‌లో ఒకటైనా.. విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్, మరెందరో స్టార్లు ఉన్నా ఆ టీమ్ ఒక్కసారి కూడా కప్పు నెగ్గలేదు. కానీ, అదే ఫ్రాంచైజీకి చెందిన ఆర్‌సీబీ అమ్మాయిలు డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లోనే తమ కలను నిజం చేసుకున్నారు.
ఫైనల్ చేరిన తొలిసారే ట్రోఫీ సొంతం చేసుకున్నారు. ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన మంధానసేన తుదిపోరులో లీగ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్ పని పట్టేసింది. సూపర్ బౌలింగ్‌తో డీసీని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆర్‌సీబీ.. చిన్న టార్గెట్‌ను జాగ్రత్తగా ఛేజ్ చేసింది. లీగ్ మొత్తం అదరగొట్టిన ఢిల్లీ మరోసారి ఫైనల్లో బోల్తా కొట్టింది. వరుసగా రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టింది.
న్యూఢిల్లీ: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. ఫైనల్ చేరిన తొలిసారే కప్ ఎగురేసుకుపోయింది. శ్రేయాంక పాటిల్ (4/12), సోఫీ మొనులిక్స్ (3/20) సూపర్ బౌలింగ్‌కు తోడు ఛేజింగ్‌లో ఎలైస్ పెర్రీ (37 బాల్స్‌లో 4 ఫోర్లతో 35 నాటౌట్), సోఫీ డివైన్ (32), కెప్టెన్ స్మృతి మంధాన (31) మెరుగ్గా ఆడటంతో.. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
టాస్ గెలిచిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 రన్స్‌కే ఆలౌటైంది. షెఫాలీ వర్మ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), మెగ్ లానింగ్ (23 బాల్స్‌లో 3 ఫోర్లతో 23) రాణించగా, ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత బెంగళూరు 19.3 ఓవర్లలో 115/2 స్కోరు చేసి గెలిచింది. రిచా ఘోష్ (17 నాటౌట్) విన్నింగ్ ఫోర్‌తో ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మొనులిక్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలర్లు అదుర్స్..
ఆరంభంలో ఢిల్లీ ఓపెనర్లు షెఫాలీ, లానింగ్ ఆర్‌సీబీ బౌలర్లను ఉతికేసినా.. మ్యాచ్ మధ్యలో అద్భుతం చేశారు. శ్రేయాంక, మొనులిక్స్ చేసిన దాడిలో ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ల జోరుతో ఓ దశలో 64/0తో మెరుగైన స్థితిలో నిలిచిన డీసీ 49 రన్స్ తేడాతో వికెట్లన్నీ కోల్పోయింది. స్టార్టింగ్‌లోనే షెఫాలీ రెండు సిక్స్‌లతో టచ్‌లోకి రాగా, 4వ ఓవర్‌లో లానింగ్ వరుసగా రెండు ఫోర్లు బాదింది.
ఐదో వర్‌లో షెఫాలీ 6, 4.. తర్వాతి ఓవర్‌లో చెరో ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 61/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడో ఓవర్‌లో 3 రన్సే వచ్చినా.. 8వ ఓవర్‌లో ఢిల్లీకి మొనులిక్స్ ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చింది. ఈ ఓవర్‌లో తొలి నాలుగు బాల్స్‌లోనే షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ (0), అలైసీ క్యాప్సీ (0)ని పెవిలియన్‌కు పంపింది. దీంతో 64/0తో ఉన్న స్కోరు ఒక్కసారిగా 65/3గా మారింది.
ఈ దెబ్బకు జడిసిన లానింగ్, మారిజానె కాప్ (8) సింగిల్స్‌కే పరిమితమయ్యారు. ఫలితంగా ఢిల్లీ ఫస్ట్ టెన్‌లో 72/3 స్కోరుకే పరిమితమైంది. 11వ ఓవర్‌లో శ్రేయాంక.. లానింగ్‌ను పెవిలియన్‌కు పంపి వికెట్ల పతనాన్ని కంటిన్యూ చేసింది. ఇక కాప్‌తో జత కలిసిన జొనాసెన్ (3) ఫెయిలైంది. పూర్తిగా ఒత్తిడికి లోనైన ఢిల్లీకి 14వ ఓవర్‌లో శోభన (2/14) డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. మూడు బాల్స్ తేడాలో కాప్, జొనాసెన్‌ను ఔట్ చేయడంతో స్కోరు బోర్డు 81/6గా మారింది. రాధా యాదవ్ (12)తో కలిసిన మిన్ను మణి (5)ని 15వ ఓవర్‌లో శ్రేయాంక ఎల్బీ చేయడంతో స్కోరు 90/7గా మారింది. 16వ ఓవర్‌లో రెండు ఫోర్లతో జోరు చూపెట్టిన రాధా 17వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌటైంది. 19వ ఓవర్‌లో శ్రేయాంక వరుసగా అరుంధతి (10), తానియా భాటియా (0)ను ఔట్ చేయడంతో ఢిల్లీ కష్టంగా 110 మార్కు దాటింది.
ఆర్‌సీబీ జాగ్రతగా..
చిన్న టార్గెట్‌ను బెంగళూరు ఓపెనర్లు స్మృతి, డివైన్ స్లోగా మొదలుపెట్టారు. సింగిల్స్ ఎక్కువగా, బౌండ్రీలు తక్కువగా ఉండటంతో పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 25 రన్సే చేసింది. ఏడో ఓవర్‌లో డివైన్ 4, 4, 6, 4తో 18 రన్స్ దంచింది. 8వ ఓవర్‌లో 6 రన్స్ రాగా, 9వ ఓవర్‌లో డివైన్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 49 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఎలైస్ పెర్రీ నిలకడగా ఆడటంతో ఫస్ట్ టెన్‌లో 56/1 స్కోరు చేసింది.
ఇక్కడి నుంచి వీరిద్దరు సింగిల్స్‌తో ముందుకెళ్లారు. మధ్యలో రెండు ఫోర్లు కొట్టిన మంధాన 15వ ఓవర్‌లో ఔటైంది. రెండో వికెట్‌కు 33 రన్స్ భాగస్వామ్యం బ్రేక్ కావడంతో స్కోరు 82/2గా మారింది. చివరి ఐదు ఓవర్లలో 32 రన్స్ అవసరమైన దశలో రిచా ఘోష్ (17 నాటౌట్), పెర్రీ నిలకడగా ఆడారు. చివరి ఓవర్లో ఐదు రన్స్ కావాల్సి ఉండగా ఘోష్ విన్నింగ్ ఫోర్ కొట్టింది.