- ఆర్‌సీబీకి ఏడో ఓటమి
- జాక్స్, రజత్, కర్ణ్ పోరాటం వృథా
- రాణించిన సాల్ట్, శ్రేయస్, రసెల్
కోల్‌కతా : ఐపీఎల్–17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఏడుపు ఒక్కటే మిగిలింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఒక్క రన్ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో ప్లేఆఫ్స్ బెర్త్‌కు మరింత దూరమైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడిన కోల్‌కతా 20 ఓవర్లలో 222/6 స్కోరు చేసింది. ఫిల్ సాల్ట్ (14 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48)
దుమ్మురేపితే, శ్రేయస్ అయ్యర్ (36 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) నిలకడగా ఆడాడు. తర్వాత ఆర్‌సీబీ20 ఓవర్లలో 221 రన్స్‌కు ఆలౌటైంది. విల్ జాక్స్ (55), రజత్ పటీదార్ (52), కర్ణ్ శర్మ (20) పోరాడినా ఫలితం లేకపోయింది. మూడు వికెట్లు కూడా తీసిన రసెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సాల్ట్ మెరుపులు..
కోల్‌కతాకు సాల్ట్ మెరుపు ఆరంభాన్నిస్తే, మధ్యలో శ్రేయస్, చివర్లో రసెల్ (27 నాటౌట్), రమన్‌దీప్ (24 నాటౌట్) పవర్ హిట్టింగ్‌తో చెలరేగారు. సాల్ట్ 6, 4, 4, 4తో బాదుడు షురూ చేయగా, నరైన్ (10) ఫెయిలయ్యాడు. ఫెర్గూసన్ వేసిన 4వ ఓవర్‌లో సాల్ట్ 6, 4, 4, 6, 4, 4తో 28 రన్స్ దంచాడు. కానీ 5వ ఓవర్ రెండో బాల్‌కే సిరాజ్ (1/40) దెబ్బకు సాల్ట్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 6వ ఓవర్లో యష్ దయాల్ (2/56) ఐదు బాల్స్ తేడాలో నరైన్, రఘువంశీ (3)ని ఔట్ చేశాడు. దీంతో కేకేఆర్ 75/3తో పవర్‌ప్లేను ముగించింది.
ఈ దశలో శ్రేయస్ నిలకడగా ఆడినా.. వెంకటేశ్ అయ్యర్ (16), రింకూ సింగ్ (24) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోయారు. అయ్యర్‌తో కలిపి ఈ ఇద్దరు 66 రన్స్ జోడించి వెనుదిరిగారు. దీంతో 10 ఓవర్లలో 107/4తో ఉన్న నైట్‌రైడర్స్ స్కోరు 15 ఓవర్లకు 149/5కి చేరింది. ఇక్కడి నుంచి రసెల్ జోరందుకున్నాడు. 17వ ఓవర్‌లో 6, 4తో 35 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన అయ్యర్ 18వ ఓవర్‌లో ఔట్ కావడంతో ఆరో వికెట్‌కు 42 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. రసెల్‌కు తోడైన రమణ్ దీప్ 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 20 రన్స్ దంచాడు. చివరి ఓవర్లో మూడు ఫోర్లతో 16 రన్స్ రాబట్టారు. ఏడో వికెట్‌కు 16 బాల్స్‌లోనే 43 రన్స్ జతకావడంతో నైట్‌రైడర్స్ భారీ స్కోరు చేసింది.
చివరి వరకు పోరాడినా..
ఛేజింగ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్లు చివరి వరకూ పోరాడినా అదృష్టం కలిసి రాలేదు. 2 సిక్స్‌లు, ఓ ఫోర్‌తో జోరుమీదున్న కోహ్లీ (18) మూడో ఓవర్లో హర్షిత్ రాణా (2/33) వేసిన ఫుల్ టాస్ బాల్‌కు అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. బాల్ నడుం కంటే ఎక్కువ ఎత్తుల్లో వచ్చినా కోహ్లీ క్రీజు బయట ఉండటంతో థర్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వలేదు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో విరాట్ గొడవ పడ్డాడు. తర్వాతి ఓవర్‌లోనే డుప్లెసిస్ (7) ఔటైనా జాక్స్, పటీదార్ పోరాటంతో బెంగళూరు స్కోరు 9 ఓవర్లలోనే వందకు చేరింది. ఈ క్రమంలో జాక్స్ 29, రజత్ 21 బాల్స్‌లో ఫిఫ్టీలు చేశారు.
కానీ 12వ ఓవర్లో రసెల్ (3/25) ఈ ఇద్దరినీ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 102 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 13వ ఓవర్లో నరైన్ (2/34) కామెరూన్ గ్రీన్ (6), మహిపాల్ లోమ్రోర్ (4)ను పెవిలియన్‌కు పంపడంతో ఆర్‌సీబీ 155/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో దినేశ్ కార్తీక్ (25), ప్రభుదేశాయ్ (24) పోరాడి జట్టును రేసులోకి తెచ్చారు. ఏడో వికెట్‌కు 32 రన్స్ జత చేసిన ప్రభుదేశాయ్18వ ఓవర్లో వెనుదిరిగాడు. ఇక 12 బాల్స్‌లో 31 రన్స్ అవసరమైన దశలో కార్తీక్ 6, 4 కొట్టి ఔటయ్యాడు.
స్టార్క్ (1/55) వేసిన ఆఖరి ఓవర్లో 21 రన్స్ చేయాల్సిన టైమ్‌లో కర్ణ్ శర్మ.. మూడు సిక్సర్లు కొట్టి ఆశలు రేపాడు. కానీ, చివరి రెండు బాల్స్‌లో 3 రన్స్ చేయాల్సి ఉండగా కర్ణ్ శర్మ.. స్టార్క్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. ఆఖరి బాల్‌కు ఫెర్గూసన్ (1) సింగిల్ తీసి రనౌట్ కావడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా : 20 ఓవర్లలో 222/6 (సాల్ట్ 48, శ్రేయస్ 50, యష్ దయాల్ 2/56).
బెంగళూరు : 20 ఓవర్లలో 221 ఆలౌట్ (విల్ జాక్స్ 55, రజత్ 52, రసెల్ 3/25).