RCB vs RR: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, సాల్ట్.. రాజస్థాన్‌కు మరోసారి ఛేజింగ్ టెన్షన్

RCB vs RR: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, సాల్ట్.. రాజస్థాన్‌కు మరోసారి ఛేజింగ్ టెన్షన్

సొంతగడ్డపై వరుసగా విఫలమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని అందించింది. గురువారం (ఏప్రిల్ 24) రాజస్థాన్ రాయల్స్ పై బ్యాటింగ్ లో అదరగొడుతూ భారీ స్కోర్ చేసింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోహ్లీ (42 బంతుల్లో 70:8 ఫోర్లు, 2 సిక్సర్లు), పడికల్ (27 బంతుల్లో 50: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో దుమ్ము లేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 70 పరుగులు చేసి కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆర్చర్, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.

 టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ, సాల్ట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వేగంగా ఆడడంలో సాల్ట్ ఇబ్బందిపడినా.. కోహ్లీ పవర్ ప్లే లో దూకుడుగా ఆడాడు. పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసి మంచి స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లే తర్వాత 23 పరుగులు చేసి సాల్ట్ ఔటయ్యాడు. ఈ దశలో కోహ్లీకి జత కలిసిన పడికల్ తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. వికెట్ కాపాడుకుంటూనే బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కోహ్లీ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

రెండో వికెట్ కు 95 పరుగులు జోడించిన తర్వాత 70 పరుగులు చేసి కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత 26 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న పడికల్ పెవిలియన్ బాట పట్టాడు. సందీప్ శర్మ వేసిన స్లో బంతిని అంచనా వేయలేకపోయిన పటిదార్ (1) వికెట్ కీపర్ కు చిక్కాడు. దీంతో ఆర్సీబీ స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. చివర్లో టిమ్ డేవిడ్ (23), జితేష్ శర్మ (20) మెరుపులు మెరిపించి బెంగళూరు స్కోర్ ను 200 పరుగులు దాటించారు.