MI vs RCB: హార్దిక్ బయపెట్టినా ఆర్సీబీదే విజయం.. ఉత్కంఠ పోరులో గెలిచి గట్టెక్కిన బెంగళూరు!

MI vs RCB: హార్దిక్ బయపెట్టినా ఆర్సీబీదే విజయం.. ఉత్కంఠ పోరులో గెలిచి గట్టెక్కిన బెంగళూరు!

ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వాంఖడే స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఛేజింగ్ లో పాండ్య(15 బంతుల్లో 42: 3 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 56:4 ఫోర్లు, 4 సిక్సర్లు) బయపెట్టినా.. కీలక సమయంలో బెంగళూరు వీరిద్దరినీ ఔట్ చేసి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకు పరిమితమైంది.   

222 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. భువనేశ్వర్ తొలి ఓవర్ లోనే 13 పరుగులు రాబట్టింది. రెండో ఓవర్ రెండు, మూడు బంతులను రోహిత్ ఫోర్ కొట్టడంతో ముంబై స్కోర్ శరవేగంగా ముందుకు కదిలింది. యష్ దయాల్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతిని 137 కి.మీ వేగంతో విసిరిన అద్భుతమైన ఇన్ స్వింగర్ కు రోహిత్ శర్మ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రికెల్ టన్ (17) ను హేజల్ వుడ్ ఎల్బీడబ్ల్యూ రూపంలో బోల్తా కొట్టించాడు.

Also Read : తగ్గేదే లేదు: 117 కి.మీ వేగంతో స్పిన్ 

పవర్ ప్లే లో 54 పరుగులు చేసిన ముంబై కావాల్సిన పరుగులు చేయలేకపోయింది. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన జాక్స్ 22 పరుగుల వద్ద కృనాల్ వేసిన బౌన్సర్ కు ఔటయ్యాడు. మరో ఎండ్ లో కెప్టెన్ సూర్య 28 పరుగులు చేయడానికి 26 బంతులు తీసుకొని ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. దీంతో 12 ఓవర్లలో ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో ముంబై చివరి 8 ఓవర్లలో 124 పరుగులు చేయాల్సిన దశలో ఓటమి ఖయామనుకున్నారు. 

కెప్టెన్ హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ ఈ సమయంలో అసాధారణంగా పోరాడారు. ముఖ్యంగా పాండ్య తొలి బంతి నుంచే ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతను ఎదుర్కొన్న తొలి 8 బంతులకు ఏకంగా 33 పరుగులు రాబట్టాడు. హార్దిక్ తో పాటు తిలక్ వర్మ బ్యాట్ ఝులిపించడంతో 12 నుంచి 16 ఓవర్ల మధ్యలో ఆర్సీబీ 71 పరుగులు పిండుకుంది. ఈ దశలో బెంగళూరు ఒత్తిడిలో పడింది. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో తిలక్ వర్మ భువీ బౌలింగ్ లో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య కూడా వెంటనే ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య నాలుగు వికెట్లు పడగొట్టాడు. హేజల్ వుడ్, యాష్ దయాల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది                 

అంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో విజృంభించింది. కెప్టెన్ పటిదార్(32 బంతుల్లో 64:5 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు.. కోహ్లీ(42 బంతుల్లో 67:8 ఫోర్లు,2 సిక్సర్లు), జితేష్ శర్మ(19 బంతుల్లో 40:2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (67) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బోల్ట్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీసుకున్నారు. విగ్నేష్ పుథూర్ కి ఒక వికెట్ దక్కింది.