DC vs RCB: కృనాల్, కోహ్లీ కేక.. ఢిల్లీపై విజయంతో టాప్‌లోకి దూసుకెళ్లిన RCB

DC vs RCB: కృనాల్, కోహ్లీ కేక.. ఢిల్లీపై విజయంతో టాప్‌లోకి దూసుకెళ్లిన RCB

ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ కొట్టింది. ఆదివారం (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ సమిష్టిగా రాణించిన ఆర్సీబీ బౌలర్లు ఆ తర్వాత ఛేజింగ్ లో కృనాల్ పాండ్య (47 బంతుల్లో 73:5 ఫోర్లు, 4 సిక్సర్లు), కోహ్లీ (47 బంతుల్లో 51:4 ఫోర్లు) భారీ భాగస్వామ్యంతో అద్భుతమైన విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్ లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి గెలిచింది.            

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. రెండో ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో సిక్సర్, ఫోర్ కొట్టి మంచి టచ్ లో కనిపించిన బెతేల్ (12).. మూడో ఓవర్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. గత రెండు మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడుతున్న పడికల్ డకౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ షాక్ లో ఉన్న ఆర్సీబీకి నాలుగో ఓవర్లో మరో బిగ్ షాక్ తగిలింది. కరుణ్ నాయర్ విసిరినా డైరెక్ట్ త్రో కి కెప్టెన్ రజత్ పటిదార్ (6)పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. 

26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బెంగళూరును కృనాల్ పాండ్య, విరాట్ కోహ్లీ ఆదుకున్నారు. ఒక మంచి క్యామియో కోసం కృనాల్ ను పంపితే అతడు ఏకంగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం విశేషం. కోహ్లీ అండతో ఈ ఆర్సీబీ ఆల్ రౌండర్ చెలరేగిపోయాడు. మొదట్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడగా.. ఆ తర్వాత  చెలరేగి ఆడాడు. మరో ఎండ్ లో కోహ్లీ కూడా తనదైన షాట్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్త చేసుకొని జట్టుకు విజయాన్ని అందించారు. చివర్లో కోహ్లీ ఔటైనా.. కృనాల్, టిమ్ డేవిడ్ (19) మ్యాచ్ ను ఫినిష్ చేశారు. డేవిడ్ 6,4,4,4 తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.  

ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు.. చమీర ఒక వికెట్ పడగొట్టారు. అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో నిరాశపరించింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. రాహుల్ (41), స్టబ్స్ (32) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హేజాల్ వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. యాష్ దయాల్, క్రునల్ పాండ్యకు తలో వికెట్ దక్కింది.