PBKS vs RCB: అలవోకగా నెగ్గిన ఆర్సీబీ.. సొంతగడ్డపై పంజాబ్ చిత్తు

PBKS vs RCB: అలవోకగా నెగ్గిన ఆర్సీబీ.. సొంతగడ్డపై పంజాబ్ చిత్తు

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో అదరగొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత బ్యాటింగ్ లో దుమ్మురేపింది. ఒక మాదిరి లక్ష్య ఛేదనలో దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61:5 ఫోర్లు, 4సిక్సర్లు) తో పాటు విరాట్ కోహ్లీ(54 బంతుల్లో 73: 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీలు చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ లో ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. 

158 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరుకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. కేవలం ఒక పరుగే చేసి సాల్ట్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే ఆ ఆనందం పంజాబ్ కు ఎంతో సేపు నిలవలేదు. కోహ్లీకి జత కలిసిన పడికల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లే లో బౌండరీలు బాదుతూ 52 పరుగులు చేశారు. ఆ తర్వాత ఈ జోడీ విజృంభించడంతో ఆర్సీబీ విజయానికి దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో పడికల్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఓ వైపు కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతుండగా.. మరో ఎండ్ లో దేవదత్ రెచ్చిపోయి ఆడాడు. చూస్తుండగానే వీరి భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఈ దశలో 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడికల్ బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పడికల్ ఔటయ్యే సమయానికి మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. పటిదార్ (12), జితేష్ కుమార్ (11) తో కలిసి కోహ్లీ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, హరిప్రీత్ బ్రార్,చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిరాశపరించింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. 33 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో  సాయుశ్ శర్మ, కృనాల్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. రొమారియో షెపర్డ్ కు ఒక వికెట్ దక్కింది.