చారిత్రక కట్టడాలు కాపాడాల్సింది ప్రభుత్వమే

చారిత్రక కట్టడాలు కాపాడాల్సింది ప్రభుత్వమే

గద్వాల, వెలుగు: చారిత్రక కట్టడాలు, రాజ వంశీయుల ఆస్తుల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాజ వంశీయులు వెంకటాద్రి రెడ్డి, సుహాసిని రెడ్డి, విక్రమసింహారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆక్రమణకు గురైన కొత్త బావిని పరిశీలించారు. అనంతరం కృష్ణారెడ్డి బంగ్లాలో వారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..  ప్రజా అవసరాల కోసం ఉపయోగపడతాయని ఉద్దేశంతో మా వంశీయులు చారిత్రక కట్టడాలను నిర్మించారన్నారు. వాటిని పరిరక్షించి ప్రజా వినియోగం కోసం వాడుకోవాలన్నారు.  వేరే వారు కబ్జా చేయడం దారుణమన్నారు. ఆనాడు రాజులు అన్ని ఆస్తులను వదులుకొని వెళ్లిపోయారన్నారు. రాజుల ఆస్తులను తాము ఎన్నడూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయలేదన్నారు. 

 మా వంశీయులు ఆరుగురు అన్నదమ్ములు, అక్క చెల్లెలు కలిగిన కుటుంబం అన్నారు. అందులో జానకమ్మ మృతి చెందడంతో ఆమె జ్ఞాపకార్థం జానకమ్మ సత్రం, జానకమ్మ బావి  (కొత్త బావి) నిర్మించారని తెలిపారు. గద్వాల సంస్థానానికి ఉన్న అపురూపమైన బలమైన పురాతన కట్టడాలను సంరక్షించకపోతే చరిత్ర క్షమించదన్నారు. ఆక్రమణకు గురైన కొత్తబావిని పునరుద్ధరించాలన్నారు. అనంతరం కలెక్టర్‌‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్ మోహన్ రావు, వెంకట్ రాములు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.