
Auto Sales 2025: మార్చి నెల ముగిసింది. దీంతో దేశంలోని ఆటో రంగంలో అమ్మకాలకు సంబంధించిన డేటా అందుబాటులోకి వచ్చింది. కొత్త కార్లు, బైక్స్ లాంచ్ కొనసాగిన వేళ అమ్మకాలు కూడా అంతే స్థాయిలో పెరగటం గమనార్హం. ఈ క్రమంలో టయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు సానుకూల అమ్మకాల ధోరణిని చూశాయి. కానీ టూవీలర్స్ కేటగిరీకి వస్తే ప్రముఖ ఆటో మేకర్ హీరో మోటార్స్ తన అమ్మకాల్లో క్షీణతను చూసింది.
ప్రస్తుతం కొన్ని కంపెనీలు తమ మార్చి అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. దీనిలో ముందుగా అందరినీ ఆకట్టుకుంటున్న అంశం రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలే. గడచిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో మెుత్తం 10 లక్షల వాహనాలను విక్రయించినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ నమోదు చేసింది. ఇప్పటి వరకు కంపెనీ ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన అమ్మకాల్లో ఇదే అత్యధికం కావటం గమనార్హం. రాయల్ ఎన్ఫీల్డ్ తన 650cc పోర్ట్‌ఫోలియోను బహుళ మోటార్‌సైకిళ్లకు విస్తరించింది. తాజాగా క్లాసిక్ 650.. దాని షాట్‌గన్ 650 ఉపయోగించే ప్లాట్‌ఫామ్‌తో ఆధారపడింది. ప్రజల ఆదాయాలు పెరగటంతో పాటు యువత నుంచి పెరుగుతున్న డిమాండ్ భారీ అమ్మకాలకు దారితీసిందని తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఈవీల విషయానికి వస్తే ఓలా ఎలక్ట్రిక్ మార్చి నెలలో ఏకంగా 23 వేల స్కూటర్లను విక్రయించినట్లు వెల్లడించింది. ఇక కియా సంస్థ కార్ల అమ్మకాల విషయంలో గత ఏడాది మార్చితో పోల్చితే 19 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. అలాగే ఎంజీ తన మెుత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 85 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే మహీంద్రా ఎస్ యూవీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 18 శాతం గ్రోత్ నమోదు చేశాయి.
ALSO READ | VI Stock: రంకెలేస్తున్న వొడఫోన్ ఐడియా స్టాక్.. నేడు 20% అప్, ఇంకా పెరుగుతుందా..?
ఇదే సమయంలో ఆటో దిగ్గజం టయోటా తన అత్యధిక అమ్మకాలను మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసినట్లు వెల్లడించింది. కంపెనీ అమ్మకాల అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 28 శాతం పెరిగాయని వెల్లడించటం గమనార్హం. అయితే మారుతీ సుజుకీ అమ్మకాల సంఖ్యలు మాత్రం మార్చిలో నిరాశకు గురిచేశాయి. ఈ ఏడాది మార్చిలో కేవలం 2 వేల 391 యూనిట్లను కంపెనీ విక్రయించగా 2024 మార్చిలో ఇవి 3వేల 612గా నమోదయ్యాయి.
ఇదే సమయంలో సుజుకీ మోటార్ సైకిల్స్ సంస్థ గడచిన ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 12 లక్షల 56 వేల 161 యూనిట్లను విక్రయించి ఆరోగ్యకరమైన పనితీరును కనబరిచింది. ఇదే క్రమంలో స్కోడా అమ్మకాలు మార్చిలో 7వేల 422 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో స్కోడా నెలవారి అమ్మకాల విషయంలో మార్చిలో తన అత్యధికాన్ని చూసింది. లగ్జరీ కార్ల విక్రయదారు అయిన ఆడీ కూడా మార్చిలో 1223 యూనిట్లను అమ్మి గత ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 17 శాతం వృద్ధితో ఉన్నట్లు వెల్లడించింది.