నోటీసులు రెడీ..సీఎంఆర్​ ఇవ్వని 90 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్

నోటీసులు రెడీ..సీఎంఆర్​ ఇవ్వని 90 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్

నాగర్ కర్నూల్, వెలుగు : ప్రభుత్వం నుంచి తీసుకున్న వడ్లు పట్టించి ఎఫ్​సీఐకి సీఎంఆర్ పెట్టని రైస్​ మిల్లర్లకు డిఫాల్టర్, రెవెన్యూ రికవరీ యాక్ట్​ కింద నోటీసులు అందించేందుకు సంబంధిత ఆఫీసర్లు నోటీసులు రెడీ చేశారు. సీఎంఆర్​ పెట్టడానికి జనవరి 31తో గడువు ముగియడంతో జిల్లాలో 109 మిల్లుల్లో (1 ఏసీకే)29 టన్నుల కంటే ఎక్కువ సీఎంఆర్​ బకాయి  ఉన్న 90 రైస్​ మిల్లులకు నోటీసులు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు డీఎస్​వో స్వామి కుమార్​ తెలిపారు. ప్రభుత్వం మరోసారి గడువు పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో శనివారం నోటీసులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

మూడేండ్ల లెక్కలు లేవు..

2023 ఖరీఫ్​లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను మిల్లులకు అలాట్​ చేసింది. జిల్లాలోని పారా బాయిల్డ్, రా రైస్​ మిల్లులు  కెపాసిటీ, ట్రాక్​ రికార్డ్​ పరిశీలించకుండా సివిల్​ సప్లై ఆఫీసర్లు పైరవీలు చేసిన వాళ్లకు, నచ్చిన మిల్లర్లకు అడ్డగోలుగా వడ్లు అలాట్​ చేశారు.2019-–20 నుంచి 2023 ఖరీఫ్, యాసంగిలో ఏ మిల్లుకు ఎంత వడ్లు ఇచ్చారు. సీఎంఆర్​ ఎంత ఇచ్చారనే లెక్కాపత్రాలు లేవని సమాచారం.2020–-21కి సంబంధించి ఇంకా 11వేల మెట్రిక్​ టన్నుల బియ్యం ఎఫ్​సీఐకి పెట్టాల్సి ఉండగా, ఆ మిల్లుల నుంచి బియ్యం రికవరీ చేయలేదు.

అయినప్పటికీ నోటీసులు, కేసులు పెట్టలేదంటే బియ్యం దందా బంధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బియ్యం దందా, సీఎంఆర్​పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఎఫ్​సీఐకి పెండింగ్​ సీఎంఆర్​పై వారానికోసారి రివ్యూ  చేస్తున్నారు.​ బీఆర్ఎస్​ సర్కార్​ ప్రమోట్​ చేసిన బియ్యం దందాతో ఒకే ఏడాదిలో నాగర్​కర్నూల్​ జిల్లాలో 53 కొత్త మిల్లులు పుట్టుకొచ్చాయి.

ధాన్యం, బియ్యం, తవుడు, నూకలు, మిల్లింగ్​ చార్జీలు, చివరికి కరెంట్​ బిల్లుల లెక్కలు కూడా సక్కగా లేనంతగా దందా నడిపించారు. నాగర్​ కర్నూల్​ జిల్లాలో ఐదేండ్లు పని చేసిన ఓ సివిల్​ సప్లై ఆఫీసర్​ అన్నీ తానై నడిపించాడనే ఆరోపణలున్నాయి. అప్పటి మంత్రి, ఎమ్మెల్యేల సపోర్ట్​ కూడా ఉండడం ఆయనకు కలిసొచ్చిందని అంటున్నారు.

పొట్టు కూడా లేదు...

2023 ఖరీఫ్​లో ఇచ్చిన వడ్లకు సంబంధించి ఇంకా 36 వేల మెట్రిక్​ టన్నుల బియ్యం ఎఫ్​సీఐకి పెట్టాల్సి ఉంది.2023 యాసంగికి సంబంధించి (95 వేల మెట్రిక్​ టన్నుల బియ్యం) 1.30 లక్షల వడ్లు మిల్లుల్లో లేదు. ప్రభుత్వం వేలం వేసి అమ్మడానికి మిల్లుల్లో వడ్లు, పొట్టు కూడా లేదు. క్వింటాల్​కు ఇంత అని ప్రభుత్వం రేట్​ ఫైనల్​ చేస్తే, ఆ రేట్​ ప్రకారం డబ్బులు కట్టిస్తామని మిల్లర్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం సీరియస్​ యాక్షన్​ తీసుకుంటే ఏం చేయాలనే దానికిపై మిల్లర్లు లీగల్​ ఓపీనియన్​ కోసం అడ్వకేట్ల చుట్టూ తిరుగుతున్నారు.