ఫేక్ పట్టాలతో పరిహారం .. ముంపు రైతులకు ఇంకా అందని పరిహారం

ఫేక్ పట్టాలతో పరిహారం .. ముంపు రైతులకు ఇంకా అందని పరిహారం
  • గట్టు రోడ్డు వ్యవహారంలో డబుల్  ప్రొసీడింగ్స్  కలకలం
  • లిఫ్ట్​లో లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్ల భూ దందా

గద్వాల, వెలుగు: గట్టు లిఫ్ట్, రోడ్​ నిర్మాణానికి సంబంధించి భూముల పరిహారం మంజూరులో అక్రమాలు జరిగాయి. రైతులు కాకపోయినా.. భూమి లేకపోయినా గట్టు లిఫ్ట్​ కింద భూములు పోయాయని రికార్డులు సృష్టించి పరిహారం నోక్కేశారు. ప్రొసీడింగ్​​ఆర్డర్స్ తో రెండు సార్లు పరిహారాన్ని కాజేసేందుకు పక్కా స్కెచ్  వేసి అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములను టార్గెట్  చేసి అధికార పార్టీ లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్లు గతంలో చేసిన తతంగం వెలుగులోకి వస్తోంది. భూములు లేకుండానే గట్టు లిఫ్ట్​లో 20 మంది పరిహారం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే అసలైన రైతులకు మాత్రం ఇంకా పరిహారం అందలేదు.

గతంలో గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో ప్రభుత్వ భూములకు ఫేక్ పట్టాలు సృష్టించి పరిహారం కొట్టేసేందుకు ప్రయత్నం చేయగా, ఆ విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత ఆఫీసర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పెండింగ్ లో పెట్టేశారు. అదే తరహాలో ఇప్పుడు గట్టు లిఫ్ట్, రోడ్​ భూముల పరిహారంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఫేక్  పట్టాలతో పరిహారం..

గట్టు, ధరూర్, కేటిదొడ్డి మండలాల్లోని 33 వేల ఎకరాల భూములకు సాగునీరు ఇచ్చేందుకు గట్టు లిఫ్ట్ ను స్టార్ట్ చేశారు. ఇందులో 960 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని గుర్తించారు. అందులో 575 ఎకరాలు ప్రభుత్వ భూమిగా, మిగతావి పట్టా భూములుగా గుర్తించారు. ఈ 575 ఎకరాలలో ప్రభుత్వ భూమిలో ఫేక్ పట్టాలు సృష్టించి దాదాపు 20 మంది పరిహారాన్ని కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఓ రెవెన్యూ ఆఫీసర్, గట్టు మండలంలోని అధికార పార్టీ లీడర్లు పరిహారం తీసుకొని పంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

డబుల్ ప్రొసీడింగ్స్..

2013లో మార్లబీడు నుంచి గట్టు వరకు వేసిన రోడ్డు పరిహారంలో కూడా చేతివాటం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తుమ్మలచెరువు శివారులో రోడ్డు కోసం దాదాపు 30 ఎకరాల వరకు సేకరించారు. మొదటి విడత పరిహారం చెల్లించాక, రెండో విడత కోసం లబ్ధిదారులు కోర్టుకు వెళ్లగా అక్కడ ఒకే లబ్ధిదారుడి పేరుతో రెండుసార్లు ప్రొసీడింగ్స్  ఇచ్చినట్లు గుర్తించారు. తుమ్మలచెరువు విలేజ్ లో ఇద్దరి పేర్లపై డబుల్  ప్రొసీడింగ్స్  తీసుకొని పరిహారం కొట్టేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. 4 సెంట్ల భూమిని 40 సెంట్లుగా దిద్ది పరిహారం తీసుకునేందుకు స్కెచ్  వేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఇదిలాఉంటే ఫేక్  పట్టాల వారికి ముందుగా పరిహారం అందించిన ఆఫీసర్లు, అసలైన రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు. గట్టు లిఫ్ట్​లో 232 ఎకరాలకు సంబంధించిన పరిహారం రైతులకు ఇవ్వాల్సి ఉంది.

పక్కాగా ఎంక్వైరీ చేస్తాం..

గతంలో ఉన్న ఆఫీసర్ల ప్రొసీడింగ్స్  ప్రకారం పరిహారం ఇచ్చి ఉండవచ్చు. అక్కడి తహసీల్దార్ తో రికార్డులు తెప్పించి ఎంక్వైరీ చేస్తాం. గట్టు రోడ్​ విషయంలో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తాం. ఈ రెండు వ్యవహారాల్లో ఎంక్వైరీ చేసి కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.

 చంద్రకళ, ఆర్డీవో, గద్వాల