రాజమౌళి .. డాక్యుమెంటరీ ట్రైలర్‌‌‌‌ రిలీజ్

రాజమౌళి .. డాక్యుమెంటరీ ట్రైలర్‌‌‌‌ రిలీజ్

తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్‌‌‌‌కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో  ఆస్కారుకు సైతం చేరువ చేసిన దర్శకధీరుడు రాజమౌళిపై నెట్‌‌‌‌ఫ్లిక్స్ సంస్థ ‘ మోడర్న్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌’ పేరుతో  డాక్యుమెంటరీ రూపొందించింది. ఆగస్టు 2 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. సోమవారం రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌‌‌‌ అందర్నీ ఆకర్షిస్తోంది. ఇందులో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌‌‌తో పాటు హాలీవుడ్ దర్శకుడు కామెరూన్, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌‌‌‌‌‌‌‌లు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

‘ఇప్పటివరకు ఎవరూ చూపని కథలను ప్రపంచానికి చెప్పడం కోసమే రాజమౌళి జన్మించారు.. అతనో మ్యాడ్‌‌‌‌ మ్యాన్.. తాను అనుకున్నది ఎలాగైనా తీస్తాడు..’ అని ఎన్టీఆర్ చెప్పాడు. ‘సినిమాలంటే ఇంత పిచ్చి ప్రేమ ఉన్న దర్శకుడిని ఇప్పటివరకు చూడలేదు’ అని ప్రభాస్ అన్నాడు. ‘ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయా’ అని చరణ్ చెప్పాడు.

రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా ఆయన వర్క్ చేయగలరు’ అని జేమ్స్ కామెరూన్ అన్నారు. రాజమౌళి ఒక లెజెండ్ అని కరణ్ జోహర్ అనగా, ఆయనొక పని రాక్షసుడని రమా రాజమౌళి అన్నారు.   సినిమా విజయం కోసం.. ఆయన పడే కష్టం, తపన, ఆలోచన సహా  అన్ని విషయాలను ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్టు నైట్‌‌‌‌ ఫ్లెక్స్ సంస్థ తెలియజేసింది.