వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైఎస్​ జగన్

వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైఎస్​ జగన్

కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ నాయకులతో సమీక్షించారు.  వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు  వైసీపీ అధినేత  జగన్  వెల్లడించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు జగన్ కు తెలిపారు.  

వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ, సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.  వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న  వైయస్‌ జగన్... వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, అయినా నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.