వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామ పంచాయతీ నిధులను అధికారులు, సర్పంచ్ కాజేశారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం చుట్టూ అభివృద్ధి పనుల పేరుతో కోటి రూపాయలకు పైగా స్వాహా చేశారు. శుక్రవారం డీఎల్ పీఓ స్వరూపా రాణి ఆకస్మిక తనిఖీ చేయగా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
రామప్పకు వచ్చే సందర్శకుల నుంచి పార్కింగ్ పేరుతో వసూలు చేసిన రూ.44 లక్షల 5 వేలు, గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల కోసం 60 లక్షల 8,498 రూపాయలకు సంబంధించిన బుక్స్, ఎంబీ రికార్డులు, మస్టర్లు, ఓచర్లు, చలాన్లు లేకపోవడంతో కోటి 4 లక్షల 13,498 రూపాయల నిధులు దుర్వినియోగం అమయ్యాయని తేలింది. లెక్కలను, వాటికి సంబంధించిన రికార్డులను వారం రోజుల్లోగా చూపించాలని అధికారులను డీఎల్ పీఓ స్వరూపారాణి ఆదేశించారు. లేకపోతే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. మరోవైపు కోటి రూపాయలు స్వాహా చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలంపేట గ్రామస్తులు కోరుతున్నారు.