మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రూ.45,000 జీతంతో స్టోర్ కీపర్‌గా రిటైరైన ఉద్యోగి ఇంట్లో లోకాయుక్త అధికారుల సోదాలు నిర్వహించగా రూ.10 కోట్ల విలువైన నగదు, ఆస్తులు అక్రమంగా పోగేసినట్లు బయటపడ్డాయి. అధికారులు వివరాల ప్రకారం.. అష్ఫాక్ అలీ స్టోర్ కీపర్ పదవి నుండి పదవీ విరమణ చేసినప్పుడు ఆయన జీతం నెలకు రూ. 45,000. తాజాగా ఆయన ఇంటిపై జరిగిన దాడుల్లో రూ.46 లక్షల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు దొరికాయి.
ఆయన ఇంట్లో లక్షల రూపాయల విలువైన మాడ్యూలర్ కిచెన్, షాండ్లియర్లు, ఖరీదైన సోపాలు, రిఫ్రిజిరేటర్, టెలివిజన్ వంటివి ఉన్నాయి. దీంతోపాటు లోకాయుక్త అధికారులు వివిధ ప్రదేశాల్లో అలీకి స్థిరాస్తులున్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనావేశారు. కేవలం అలీ పేరిటే ఉన్న 16 స్థిరాస్తి పత్రాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటివిలువ రూ. 1.25 కోట్లకుపైగా ఉంటోందని అంచనా వేశారు.
ఇక ఆయన భార్య పిల్లల పేరిట ఉన్న ఆస్తులు దీనికి అదనం. వీటితోపాటు నాలుగు భవనాలు, 14,000 చదరపుటడుగుల్లో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించారు. అంతేకాదు అలీ మూడు అంతస్తుల భవనంలో ఓ పాఠశాలను కూడా నడుపుతున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని అష్ఫాక్ అలీపై ఫిర్యాదు రావడంతో దాడులు నిర్వహించారు. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా రాజ్‌గఢ్‌లోని జిల్లా ఆస్పత్రిలో అష్ఫాక్ స్టోర్ కీపర్‌గా పనిచేశాడు.