హైదరాబాద్, వెలుగు: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వృద్ధుడిని బెదిరించి రూ.10.61 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ)అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(75)కి గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఓ ప్రకటనలో తెలిపారు. నిందితులు ముంబై పోలీసులుగా పరిచయం చేసుకుని, ఆధార్, పాన్ కార్డుతో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందని వృద్ధుడిని బెదిరించారని తెలిపారు.
సీబీఐ,ఈడీ,ఇన్‌కమ్ ట్యాక్స్, ఇతర విభాగాల పేర్లతో నకిలీ నోటీసులు వాట్సాప్‌లో పంపించి బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా వృద్ధుడిని బెదిరించి రూ.10.61 కోట్లు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా బెంగళూరుకు చెందిన వినయ్ కుమార్, మారుతిని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. అద్దెకు తీసుకున్న బ్యాంకు ఖాతాలకు నిందితులు డబ్బులు మళ్లించినట్లు గుర్తించారు.