ప్రచారంలో రోజుకి ఒకరికి ముట్టజెప్తున్న క్యాండిడేట్లు
మరికొన్నిచోట్ల ఎన్నికలయ్యే దాకా ఓవరాల్ ప్యాకేజీ
బహిరంగ సభలు, సమావేశాలకు అదనం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో నగరంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే టికెట్లు దక్కిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారం షురూ చేశారు. దీంతో ప్రచార జనానికి డిమాండ్ పెరిగింది. ఇందుకోసం కొందరు క్యాండిడేట్లు రోజువారీగా ప్రచారానికి జనాన్ని మాట్లాడుకుంటుంటే మరికొన్నిచోట్ల ఎన్నికలయ్యే దాకా ఓవరాల్ ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం
ప్రచారంలో అభ్యర్థితోపాటు మంది మార్బలం, ఉంటేనే ప్రచారంలో ఊపు ఉంటుంది. అయితే పార్టీ కేడర్ వేర్వేరు పనుల్లో బిజీగా ఉండటంతో ప్రచారానికి జనాలను రప్పిస్తున్నారు. ఇందుకు ఒక్కో వ్యక్తికి రోజుకు 700 నుంచి 1000 వరకు ఇవ్వడంతోపాటు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఆడోళ్లు, మగోళ్లకు డబ్బుల చెల్లింపుల్లో 200 వరకు తేడా ఉంటోంది. ఉదయం నుంచి రాత్రివరకు వీరిని ఉపయోగించుకుంటున్నారు. ప్రచారకర్తలకు ఉదయం టీ, టిఫిన్ తినిపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత బిర్యానీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరికొందరిని ఎన్నికలు అయిపోయేవరకు గుండుగుత్తగా ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. అసలే కరోనా కాలం కావడంతో ఖాళీగా ఉన్నోళ్లు ప్రచారానికి బయలుదేరుతున్నారు.
సభలు, సమావేశాలకు అదనం
ప్రచారానికి ఒక రేటు ఇస్తుండగా, ఇక బహిరంగ సభలు, సమావేశాలకు మరో రేటు ఉందని క్యాంపెయినింగ్ కోఆర్డినేటర్లు చెబుతున్నారు. ప్రచారంతో పోలిస్తే మీటింగ్, బహిరంగ సభలకు పెద్దఎత్తున జనాలు అవసరం. త్వరలో సీఎం కేసీఆర్ బహిరంగ సభతోపాటు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ఉత్తమ్కుమార్ రెడ్డి తదితర కీలక నేతలు బహిరంగ సమావేశాలకు హాజరుకానున్నారు. అలాంటి టైంలో భారీ జనసందోహం అవసరం. సభల్లో జనాలు, హడావుడి లేకుంటే ప్రజల్లో పలచనవుతామనే ఆందోళన అభ్యర్థుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలకు కాస్త అదనంగా సమర్పించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
మేస్త్రీలతో ఒప్పందాలు
పెద్ద సంఖ్యలో రోజువారీ కార్యకర్తల అవసరం ఉండటం, నేరుగా పార్టీల ముఖ్యనేతలే వారిని సమకూర్చుకోవడం కష్టంతో కూడుకున్న పని కావడంతో అడ్డాల్లో వివిధ పనులకు కూలీలను తీసుకెళ్లే అలవాటు ఉన్న మేస్త్రీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. సాధారణంగా అడ్డా కూలీలకు రూ. 500 నుంచి రూ. 800 వరకు గిట్టుబాటు అవుతుంది. అంతకంటే ఎక్కువగా ఇస్తుండటంతో కూలీలు ప్రచారబాట పడుతున్నారు.
క్యాంపెయిన్ స్టార్ట్
ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. కేడర్.. జెండాలు పట్టుకొని, పార్టీల టోపీలు పెట్టుకొని, కరపత్రాలు పంచుతున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్నారు. గెలిస్తే ఏం చేస్తామో వివరిస్తున్నారు. కొందరైతే ప్రత్యేకంగా పార్టీ రంగులో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ ప్రచారాన్ని రంగులమయం చేస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల ఫొటో, పార్టీ గుర్తుతో కూడిన చిన్న వాహనాలు, బైక్‌లు, రిక్షాబండ్లు తిప్పుతున్నారు.
For More News..