హైదరాబాద్​ను మరింత విస్తరిస్తం

హైదరాబాద్​ను మరింత విస్తరిస్తం
  • హైదరాబాద్​ ను  ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తం: డిప్యూటీ సీఎం భట్టి
  • అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించినం: మంత్రి ఉత్తమ్
  • బిల్డర్లతో సమావేశంలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సెక్రటేరియెట్​లో బిల్డర్లతో భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. బిల్డర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ సిటీ విస్తరణలో బిల్డర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, వరల్డ్ క్లాస్ స్టేడియంలు, స్కిల్ యూనివర్సిటీ వంటి గొప్ప ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు బిల్డర్స్ కోరిన విధంగానే బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయిస్తాం. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. బిల్డర్లే సంపద సృష్టికర్తలు’’అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. 

బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి ఉత్తమ్ 

హైదరాబాద్ సిటీ డెవలప్​మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అందుకే బిల్డర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

డిఫాల్టర్లకు ధాన్యం కేటాయించం

ఈ సీజన్​లో డిఫాల్టర్లకు ధాన్యం కేటాయించేదిలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్​లో  ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటైన సబ్ కమిటీ సమావేశమైంది. డిఫాల్టర్లు బియ్యాన్ని మొత్తం త్వరితగతిన ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. డిఫాల్టర్ల విషయంలో కఠినంగా ఉండాలని  నిర్ణయించినట్టు చెప్పారు. క్వింటా సన్న వడ్లను మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం వస్తాయని, క్వింటా దొడ్డు వడ్లను మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం వస్తాయని, ట్రాన్స్​పోర్ట్, కస్టడీ, మిల్లింగ్ చార్జీల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిందని మిల్లర్లు సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు ఆన్​లైన్​లో మీటింగ్​కు హాజరయ్యారు.