హైదరాబాద్లో పెట్టుబడి స్కీముల పేరిట రూ.14 కోట్ల మోసం

హైదరాబాద్లో పెట్టుబడి స్కీముల పేరిట రూ.14 కోట్ల మోసం
  • వెల్​ విజన్​ గ్రూప్​ చైర్మన్​ శ్రీనివాసరావు అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు:పెట్టుబడి స్కీముల పేరిట 200 మంది బాధితుల నుంచి రూ.14 కోట్లు వసూలు చేసి, రిటర్న్స్ ఇవ్వకుండా మోసం చేసిన వెల్​విజల్​గ్రూప్​ఆఫ్ కంపెనీ చైర్మన్ ​కందుల శ్రీనివాసరావును సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్సెస్ ​వింగ్​ పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. ఏపీలోని వెస్ట్​ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస్​రావు(44) హైదరాబాద్​లోని గోకుల్​ ప్లాట్స్​ వెంకట రమణ కాలనీలో వెల్​విజన్ గ్రూప్​ ఆఫ్ పేరిట​కంపెనీ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్​గా ఉన్నాడు. ఇతని భార్య డైరెక్టర్​గా కొనసాగుతుంది. తన కంపెనీలో ఉన్న వివిధ స్కీముల్లో పెట్టుబడి​ చేస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్​ ఇస్తానని సోషల్​ మీడియా, ఇతర సామాజిన మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.

స్కీమ్​-1లో..  ఒక వ్యక్తి లక్ష డిపాజిట్​చేస్తే 100 రోజుల పాటు రోజుకి రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ప్రకటించాడు. స్కీమ్-2లో.. లక్ష డిపాజిట్​ చేస్తే  నెలకు రూ.20 వేల చొప్పున పది నెలల పాటు చెల్లిస్తామని,  స్కీమ్-3లో రూ. 6.50 లక్షలు డిపాజిట్​ చేస్తే నగర శివారులో 121 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్​చేస్తామని,  ఆ తర్వాత 20 నెలల పాటు నెలకు రూ.32,500 ఇస్తామని ప్రకటించారు.

దీని కోసం ఎంఓయూతో పాటు చెక్కులు కూడా చెల్లిస్తామని తెలిపారు. స్కీమ్-4లో వెస్​విజన్​హోం అప్లయన్సెస్​లో టీవీ, వాషింగ్​ మిషన్​, ఏసీ వంటి వస్తువులు కొనుగోలు చేస్తే వస్తువు ధరను ప్రతి నెల తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇలా ప్రతి స్కీమ్​లో రూ.10 వేల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్​ చేయవచ్చని తెలిపారు. అయితే, ఈ స్కీమ్​ల గురించి తెలుసుకున్న రాజేంద్రనగర్​ అత్తాపూర్​కు చెందిన ఝాన్సీ స్కీమ్​ -1,2లలో పెట్టుబడులు పెట్టింది. అయితే, నెలలు గడిచినా రిటర్న్స్​రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు శ్రీనివాస్​రావును మంగళవారం అరెస్ట్​ చేశారు. నిందితుడు వివిధ స్కీమ్​ల పేరుతో 200 మంది నుంచి రూ. 14 కోట్లు వసూల్ చేసినట్లు గుర్తించారు.