రూ.50 లక్షలతో పూర్తయ్యే సర్వేకు.. 16.50 కోట్ల ఖర్చు

రూ.50 లక్షలతో పూర్తయ్యే సర్వేకు.. 16.50 కోట్ల ఖర్చు
  • డిండి లిఫ్ట్ స్కీమ్​ సర్వేలో ఇరిగేషన్
  • రూ.50 లక్షలతో పూర్తయ్యే సర్వేకు.. 16.50 కోట్ల ఖర్చు
  • డిండి లిఫ్ట్ స్కీమ్​ సర్వేలో ఇరిగేషన్ బాస్ ఇష్టారాజ్యం!
  • ప్రాజెక్టు సోర్సు కోసం ఇప్పటికే ఏడు సార్లు సర్వే
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎనిమిదో సారి నోటిఫికేషన్
  • రిటైర్డ్ ఇంజినీర్ కు చెందిన ఏజెన్సీకే 8 సార్లు అవకాశం

హైదరాబాద్, వెలుగు: డిండి లిఫ్ట్ స్కీమ్​ సర్వేల మాయలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. పుష్కర కాలానికి పైగా ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​కు సూపర్ పవర్ గా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి, మరో రిటైర్డ్ ఇంజినీర్ తో కలిసి ఈ ప్రాజెక్టు భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శంకుస్థాపన చేసిన రెండో ప్రాజెక్టు డిండి లిఫ్ట్ స్కీమ్. దీనికి ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించేందుకు ఇప్పటికే ఏడు సార్లు సర్వే చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎనిమిదో సారి సర్వేకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు.

 గతంలో ఏడు సార్లు ఏ ఏజెన్సీ కి సర్వే టెండర్ కట్టబెట్టారో.. ఎనిమిదో సారి కూడా అదే ఏజెన్సీ టెండర్ దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇరిగేషన్ బాస్ మాస్టర్ మైండ్ గా వ్యవహరించారు. రూ.50 లక్షలతో పూర్తయ్యే సర్వేకు ఏకంగా రూ.16.50 కోట్లు కట్టబెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు మౌత్ పీస్ గా పని చేసిన రిటైర్డ్ ఇంజినీర్ కు ఇలా జేబులు నింపే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరు రిటైర్డ్, సర్వీస్ ఇంజినీర్లు పాత్రదారులుగా ఉన్నారు.

సర్వేలు నిర్వహించారిలా..

  •  2007లో జీవో నం.159.. లోయర్ డిండి నుంచి అప్పర్ డిండికి నీటిని లిఫ్ట్ చేసే ప్రాజెక్టు సర్వేకు రూ.1.20 కోట్లు చెల్లించారు.
  •  2014లో జీవో నం.70.. జూరాల -పాకాల ప్రాజెక్టు పేరుతో సర్వే. రూ.3.03 కోట్లు చెల్లింపు
  •  ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి నీటిని తరలించాలని మధ్యలో ప్రతిపాదన.. అది ఆలస్యం అవుతుందని చెప్తూ.. 2014లో జీవో 61 పేరుతో ఆల్టర్నేట్ ప్రపోజల్స్   సర్వేకు రూ.6 కోట్లు చెల్లింపు
  •  2016లో పాలమూరు ఎత్తిపోతలను ప్రతిపాదించిన జీవో నం. 806లో డిండి కోసం సర్వే చేశారు. రూ.2.50 కోట్లు చెల్లించారు.
  •  806 జీవోకు  అనుబంధంగా చేసిన సర్వేలో భాగంగా డిండి లిఫ్ట్ కోసం ఉల్పర రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు.
  •  పాలమూరు లో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని ప్రతిపాదించారు.. 2018లో మళ్లీ సర్వే చేసి రూ.70 లక్షల బిల్లు తీసుకున్నారు.
  •  డిండి లిఫ్ట్ స్కీం విస్తరణలో భాగంగా హైదరాబాద్ తాగునీటి కోసం రాచకొండ రిజర్వాయర్ కు నీటిని తరలించడానికి 2018లో జీవో నం.496 పేరుతో మళ్లీ     సర్వే చేశారు. రూ.2.50 కోట్ల బిల్లు తీసుకున్నారు.
  •  వట్టెం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే సర్వే కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 9న టెండర్ నోటిఫికేషన్ .. ఇందుకు రూ.40.83 లక్షలు చెల్లిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్న డిపార్ట్​మెంట్. రిటైర్డ్ ఇంజినీరు ఏజెన్సీకే ఈ టెండర్ అప్పగింత.

రిటైర్డ్ ఇంజినీర్ కు చెందిన ఏజెన్సీకే కాంట్రాక్టు

శ్రీశైలం ఫోర్ షోర్ లో పంపు హౌస్ నిర్మించి రోజుకు అర (0.50) టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు ఎత్తిపోసేందుకు 2015, జూన్ 11న జీవో నం.107 జారీ చేశారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గల్లోని కొన్ని ప్రాంతాలకు కలిపి 3.14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు రూ.6,190 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. 

అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు. శ్రీశైలం ఫోర్ షోర్ లోని నార్లాపూర్ నుంచి రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేలా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు అంతకు ముందే శంకుస్థాపన చేశారు. తర్వాత కొందరు రిటైర్డ్ ఇంజినీర్ల జోక్యంతో డిండి లిఫ్ట్ స్కీమ్​ ముందుకు సాగలేదు. ప్రాజెక్టు పనులు షురూ చేసి దాదాపు 9 ఏండ్లు అవుతున్నా.. పది శాతం పనులు కూడా చేయలేదు. శ్రీశైలం నుంచి నీళ్లు తరలించాలని జీవో 107 స్పష్టంగా చెప్తున్నా.. సర్వేల పేరుతో ఏండ్లకేండ్లుగా ప్రాజెక్టు సోర్స్ పాయింట్​ను తేల్చలేదు. 

ఉమ్మడి ఏపీలో 2007లో మొదటి సారి సర్వే చేశారు. అప్పుడు సర్వీస్ లో ఉన్న ఇంజినీర్ కు సంబంధించిన వారి ఏజెన్సీకి ఈ సర్వే కాంట్రాక్టు దక్కింది. తెలంగాణ ఏర్పడే నాటికే ఆ ఇంజినీర్ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వానికి అనధికారిక సలహాదారు అవతారం ఎత్తారు. ఆ ముసుగులో తన సర్వే ఏజెన్సీకి చేతినిండా పని ఉండేలా జాగ్రత్త పడ్డారు. 2015 నుంచి 2018 మధ్య ఈ ప్రాజెక్టు సోర్స్ తేల్చే పని పేరుతో ఏకంగా ఆరు సార్లు సర్వే చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే మరోసారి సర్వేకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అక్టోబర్ లో టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి సదరు రిటైర్డ్ ఇంజినీర్ ఏజెన్సీకే పనులు కట్టబెట్టారు.

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ హామీ ఇది..

పాలమూరు - రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీమ్​లకు శ్రీశైలం ఫోర్ షోర్ లో వేర్వేరు పంపు హౌస్ లు ఏర్పాటు చేసి నీటిని తరలిస్తామని సీఎం హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేయాలనే లక్ష్యం తో పాలమూరు, డిండి ఎత్తిపోతలపై దృష్టి సారించలేదు. దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్న ఇరిగేషన్ బాస్, సదరు రిటైర్డ్ ఇంజినీర్ సర్వేల మాయకు తెర తీశారు. ఏకంగా రూ.16.50 కోట్లు కొల్లగొట్టారు. ఒకే ఏజెన్సీకి.. ఒకే ప్రాజెక్టు సర్వే పనులు వరుసగా ఎనిమిది సార్లు కట్టబెట్టడం వెనుక పెద్ద తతంగమే నడిచిందనే చర్చ ఇరిగేషన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.