కోనాపూర్ సొసైటీలో అక్రమాలు నిజమే .. రెండోసారి విచారణలోనూ నిర్ధారణ

కోనాపూర్ సొసైటీలో అక్రమాలు నిజమే .. రెండోసారి విచారణలోనూ నిర్ధారణ
  • రూ.1.67 కోట్లు దుర్వినియోగం అయినట్టు తేల్చిన ఎంక్వైరీ ఆఫీసర్ 
  • మాజీ సీఈవో, ప్రెసిడెంట్ డైరెక్టర్లు బాధ్యులుగా గుర్తింపు 
  • 21 శాతం వడ్డీతో రికవరీ చేయాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదిక 

మెదక్, రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కోనాపూర్  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) లో అక్రమాలు నిజమే అని రెండోసారి విచారణలో నిర్ధారణ అయింది. వివిధ అంశాల్లో మొత్తం రూ.1.67 కోట్లు దుర్వినియోగం అయినట్టు ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నతాధికారులకు విచారణ నివేదికను పంపిచారు. సొసైటీ మాజీ  సీఈవో గోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పలువురు డైరెక్టర్లను ఇందుకు బాధ్యులుగా పేర్కొంటూ వారి నుంచి 21 శాతం వడ్డీతో దుర్వినియోగం అయిన మొత్తాన్ని రికవరీ చేయాలని అలాగే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎంక్వైరీ ఆఫీసర్ సిఫారసు చేశారు. 

2021లో ఫిర్యాదు..

కోనాపూర్ సొసైటీలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని సొసైటీ డైరెక్టర్ కొల్లూరు రాములుతో పాటు మరో ఏడుగురు డైరెక్టర్లు 2021 జనవరి 21న కో ఆపరేటివ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పట్లో విచారణ జరిగింది. వివిధ పద్దుల్లో రూ.2.26 కోట్లు దుర్వినియోగమయ్యాయని గుర్తించారు. విచారణ నిబంధనల ప్రకారం జరగలేదని అప్పటి  సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డితో పాటు, ఇతరులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో  కో ఆపరేటివ్ డిపార్ట్​మెంట్ఉన్నతాధికారులు తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ సెక్షన్ 51 ప్రకారం మళ్లీ విచారణ జరపాలని 2024 డిసెంబర్ లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ అంజయ్యను ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించారు. 

సమగ్ర విచారణ..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంక్వైరీ ఆఫీసర్ కోనాపూర్ సొసైటీ కి వచ్చి డే బుక్, ఫర్టిలైజర్లకు సంబంధించిన మార్క్ ఫెడ్, ఇఫ్కో, క్రిబ్ కో, కోరమాండల్ కంపెనీల నుంచి వచ్చిన స్టాక్ రిజిస్టర్లు, సేల్స్ రిజిస్టర్లు, పెట్రోల్ బంక్ లో  రోజువారి పెట్రోల్, డీజిల్  అమ్మకాలకు సంబంధించిన డీఎస్ఆర్, వివిధ పేమెంట్లకు సంబంధించిన ఓచర్లు, డిపాజిట్ పత్రాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఇదివరకు జరిగిన థర్డ్ పార్టీ ఎంక్వైరీ రిపోర్ట్​లు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన డైరెక్టర్లు, సొసైట్ మాజీ సీఈవో గోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, డైరెక్టర్లతో పాటు ఇదివరకు పనిచేసిన మెదక్ జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్లు (డీసీవో) వెంకట్ రెడ్డి, కరుణ  తదితరులను విచారించారు.  

ఎందెందులో అంటే..

ఎంక్వైరీ ఆఫీసర్ విచారణలో టూటీ ఆయిల్, ఫర్టి లైజర్, పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో, జనరేటర్ డీజిల్ వినియోగంలో, కన్స్యూమర్ స్టోర్, పెట్రోల్ బంక్ నిర్మాణం, ఎస్ఏవో లోన్స్, కేసీసీ ఇంట్రెస్ట్ తదితర వాటిల్లో రూ.1.67 కోట్లు దుర్వినియోగం అయినట్టు ఎంక్వైరీ ఆఫీసర్ నిర్ధారించారు. ఆయా అంశాల్లో కోటి రూపాయలకు పైగా దుర్వినియోగానికి సొసైట్ మాజీ సీఈవో గోపాల్ రెడ్డి, రూ.67 లక్షల కు పైగా దుర్వినియోగానికి సొసైటీ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పలువురు డైరెక్టర్లు బాధ్యులుగా తేల్చారు. దుర్వినియోగం అయిన మొత్తాన్ని 21 శాతం ఇంట్రెస్ట్ తో బాధ్యుల నుంచి  రికవరీ చేయాలని, అలాగే పెద్ద మొత్తంలో  నిధుల  దుర్వినియోగానికి పాల్పడిన వారిపై  సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎంక్వైరీ ఆఫీసర్  ఉన్నతాధికారులకు పంపిన విచారణ నివేదికలో సిఫారసు చేశారు.