దుబాయ్​లో సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బ్యాంకు ఖాతాలు

దుబాయ్​లో సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బ్యాంకు ఖాతాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా నమోదైన 600 సైబర్  నేరాల్లో కొట్టేసిన రూ.175 కోట్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బయటపడ్డాయి. శంషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌బీఐలోని 6 కరెంట్‌‌‌‌‌‌‌‌  ఖాతాల్లో డిపాజిట్  అయిన సైబర్  నేరగాళ్ల డబ్బు గుట్టును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రట్టు చేశారు. అమాయకులకు కమీషన్ల ఆశచూపి కరెంట్‌‌‌‌‌‌‌‌  అకౌంట్లు ఓపెన్  చేసినట్లు గుర్తించారు. విజయనగర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ కాలనీకి చెందిన మహ్మద్‌‌‌‌‌‌‌‌  షోయబ్‌‌‌‌‌‌‌‌  తఖ్వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మొగల్‌‌‌‌‌‌‌‌పురాకు చెందిన మహ్మద్‌‌‌‌‌‌‌‌  బిన్‌‌‌‌‌‌‌‌  అహ్మద్‌‌‌‌‌‌‌‌  బావజీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం అరెస్టు చేశారు. 

దుబాయ్ లోని సైబర్  నేరగాళ్ల నుంచి డబ్బులు డిపాజిట్  అవుతున్నట్లు ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ వివరాలను సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శిఖా గోయల్‌‌‌‌‌‌‌‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నేషనల్‌‌‌‌‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌  క్రైం రిపోర్టింగ్‌‌‌‌‌‌‌‌  పోర్టల్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ) లో హైదరాబాద్  శంషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌లోని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ  బ్రాంచ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లపై ఫిర్యాదులు వచ్చాయి. సైబర్  నేరగాళ్లు కొట్టేసిన డబ్బు 6 కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో డిపాజిట్  అయినట్లు సైబర్  సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో బ్యూరో అధికారులు ఆ బ్యాంకు ఖాతాల ఆధారాలు సేకరించారు. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ కరెంట్‌‌‌‌‌‌‌‌  అకౌంట్ల నుంచి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో  రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా దాదాపు 600 సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలు నమోదైనట్లు గుర్తించారు.  

కమీషన్లతో కరెంట్ బ్యాంకు ఖాతాలు 

దుబాయ్  కేంద్రంగా జరుగుతున్న సైబర్‌‌‌‌‌‌‌‌  దందాల నుంచి ఈ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్  అయ్యాయి. దుబాయ్ లో షెల్టర్  తీసుకున్న సైబర్  నేరగాళ్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తమ బంధువులు, ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, అనుచరులతో కలిసి పేదలు, అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించారు. ఇందులో భాగంగా విజయనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కాలనీకి చెందిన షోయబ్‌‌‌‌‌‌‌‌, ఇతర సహచరులు కొంతమంది పేదల పేర్లతో ఈ ఏడాది ఫిబ్రవరిలో శంషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ  బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో 6 కరెంట్  ఖాతాలను ఓపెన్  చేశారు. ఇందుకు మొగల్‌‌‌‌‌‌‌‌పురాకు చెందిన మహ్మద్‌‌‌‌‌‌‌‌ బిన్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ బావజీర్‌‌‌‌‌‌‌‌ కూడా సహకరించాడు. అమాయకులకు కమీషన్ల ఆశచూపి ఖాతాలు ఓపెన్  చేశారు. బ్యాంకు ఖాతాలు తెరిచిన తర్వాత వాటిని సైబర్  నేరాల్లో కొల్లగొట్టిన డబ్బు లావాదేవీలకు, హవాలా కార్యకలాపాలకు ఆ ఖాతాలను వినియోగించారు. 

Also Read:-ఈ ఏడాదిలోనే డబుల్ ఇండ్లు! లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు

కాగా.. అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ తెరవడం, అందుకు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయడంలో షోయబ్  కీలక పాత్ర పోషించాడు. ఖాతాలు తెరిచిన తర్వాత చెక్కులపై ఖాతాదారుల సంతకాలు తీసుకుని వాటిని షోయబ్‌‌‌‌‌‌‌‌, బావజీర్‌‌‌‌‌‌‌‌  తమ కస్టడీలోనే పెట్టుకున్నారు. సైబర్  నేరాల ద్వారా డిపాజిట్‌‌‌‌‌‌‌‌  అయిన డబ్బులో కొంత డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌‌‌‌‌‌‌‌కి పంపారు. ఇలా దుబాయిలోని ప్రధాన మోసగాడి ఆదేశాలకు అనుగుణంగా ఖాతాదారులు, సహచరుల డబ్బును విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసి ఏజెంట్ల ద్వారా వివిధ వ్యక్తులకు పంపిణీ చేశారు. ఇలా మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌  నెలల్లో పెద్ద మొత్తంలో రూ.175 కోట్లు శంషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్  అయ్యాయి. ఈ డబ్బుకు సంబంధించి దేశవ్యాప్తంగా 600కు పైగా సైబర్  నేరాలు నమోదు అయ్యాయి. డబ్బులు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన అకౌంట్లు, బాధితుల ఆధారాలను సైబర్  సెక్యూరిటీ బ్యూరో అధికారులు సేకరిస్తున్నారు.