తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతంగా చేశారు. ఇదే సమయంలో ఆయా నియోజక వర్గాలకు డబ్బులు తరలింపు అనేది వేగవంతం అయ్యింది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న వందేభారత్ రైలులో 50 లక్షలు పట్టుబడగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి దగ్గర.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్షరాల 2 కోట్ల 40 లక్షల రూపాయలను సీజ్ చేశారు అధికారులు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఈ డబ్బు తరలిస్తున్నారు. 2024 మే 1వ తేదీ రాత్రి హైదరాబాద్ లో బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు.. రెండు బ్యాగుల్లో 500 రూపాయల నోట్ల కట్టలతో.. రాజమండ్రి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. తెలంగాణ సరిహద్దుల్లో తప్పించుకున్న వీరు.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాధపురం చెక్ పోస్టు దగ్గర దొరికిపోయారు. బస్సును బాగా తనిఖీ చేసిన ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్.. రెండు పెద్ద బ్యాగుల్లో ఉన్న డబ్బును గుర్తించింది. ఈ డబ్బునకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవటం.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఎందుకు తరలిస్తున్నారు అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవటంతో.. డబ్బును సీజ్ చేశారు అధికారులు.
రాజమండ్రికి కొంచెం దూరంలోనే ఈ డబ్బు పట్టుబడటం విశేషం. రాజమండ్రిలో ఉద్దండులు పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నియోజకవర్గం పరిధిలో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులకు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు ఉండటం వివేషం. అసలు ఇది ఎన్నికల కోసం తీసుకెళుతున్న డబ్బునా.. లేక వ్యక్తిగత అవసరాల కోసం తరలిస్తున్న డబ్బునా అనేది కూడా తెలియాల్సి ఉంది