- వంద మంది నుంచి కమీషన్లు తీసుకున్న లీడర్లు
- ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షల నుంచి 3 లక్షలు వసూలు
- ఓ బాధితురాలి ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతపై చీటింగ్ కేసు
- మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో వెలుగులోకి
మహబూబాబాద్/మరిపెడ, వెలుగు: మహబూబాబాద్జిల్లా చిన్నగూడూరులో డబుల్ బెడ్ రూమ్ఇండ్లు ఇప్పిస్తామంటూ బీఆర్ఎస్ లీడర్లు దాదాపు 100 మంది నుంచి రూ.2 కోట్లు వసూలు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తున్నదని, ఇండ్లను క్వాలిటీతో నిర్మించాలంటే ఆ డబ్బులు సరిపోవని ప్రచారం చేసిన బీఆర్ఎస్లీడర్లు.. రూ. 3 లక్షలు ఇస్తే మంచిగ కట్టిన ఇల్లు ఇప్పిస్తామని నమ్మించారు. దీంతో గ్రామానికి చెందిన వందలాది మంది పేదలు చిన్నగూడూరు మండల బీఆర్ఎస్ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మరికొందరు లీడర్లకు ఒక్కొక్కరు రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ముట్టచెప్పారు.
100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
చిన్న గూడూరులో రూ.5.04 కోట్లతో100 డబుల్బెడ్రూమ్ఇండ్లు నిర్మించారు. ఈ పనులకు 2022 మార్చి 23న అప్పటి డోర్నకల్ఎమ్మెల్యే డీఎస్రెడ్యానాయక్, మహబూబాబాద్ఎంపీ మాలోతు కవిత శంకుస్థాపన చేశారు. ఇండ్ల నిర్మాణం మొదలుకాగానే బీఆర్ఎస్లీడర్లు వసూళ్లకు తెర లేపారు. అందులో ఇల్లు ఇప్పిస్తామని, ఇండ్లను క్వాలిటీగా నిర్మించేలా చూస్తామని, వసతులు కల్పిస్తామని, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు కమీషన్లు ఇస్తామంటూ లక్షలకు లక్షలు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికే ఇండ్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వారికి నచ్చిన లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి వెంటనే గృహప్రవేశాలు చేయించాలనుకున్న లీడర్లు.. ఎన్నికల షెడ్యూల్రావడంతో ఇరుకున పడ్డారు. అధికారులను మేనేజ్చేసి గ్రామసభలో ఇండ్ల కేటాయింపు జరిగినట్టు తీర్మానం చేయించాలని ప్రయత్నించగా అందుకు ఆఫీసర్లు ఒప్పుకోలేదు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అసలు బాగోతం బయటపడింది. బీఆర్ఎస్ లీడర్లకు డబ్బులిచ్చినవాళ్లంతా ఇటీవల గృహప్రవేశం చేస్తామని ఇండ్లలోకి వెళ్తుండగా అధికారులు అడ్డుకున్నారు. 255 అప్లికేషన్లు వచ్చాయని, ఇప్పటివరకు ఇండ్లను ఎవరికీ కేటాయించలేదని తేల్చిచెప్పడంతో అందరూ షాక్అయ్యారు. దీంతో డబ్బులు ఇచ్చిన పేదలు పోలీస్స్టేషన్ల బాట పడుతున్నారు. తాజాగా కొడిదెల సత్తమ్మ అనే మహిళ బీఆర్ఎస్ లీడర్ధారాసింగ్పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు చీటింగ్కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
రూ.1.70 లక్షలు ఇచ్చిన
నాకు భర్త లేడు. ఉన్న ఇల్లు కూలిపోయింది. బీఆర్ఎస్ లీడర్ ధారాసింగ్ డబుల్బెడ్రూమ్ఇల్లు ఇప్పిస్తానంటే రూ.1.70 లక్షలు ఇచ్చిన. తెలిసిన వారి అకౌంట్ నుంచి రూ.1.10 లక్షలు పంపించి, మరో రూ.50 వేలు నగదు ఇచ్చిన. 7వ నెంబర్ ఇల్లు కేటాయించినట్టు చెప్పిన ధారాసింగ్.. తాళం చెవి ఇచ్చి రూ.10 వేలు తీసుకున్నడు. 7వ నెంబర్ ఇంటికి పోతే రెవెన్యూ అధికారులు వెళ్లగొట్టారు. అందుకే బీఆర్ఎస్లీడర్మీద స్టేషన్లో ఫిర్యాదు చేసిన.
- కొడిదెల సత్తమ్మ, చిన్నగూడూరు
ఇండ్ల కేటాయింపు జరగలేదు
చిన్నగూడూరులో పేదల కోసం100 ఇండ్లు కట్టాం. 255 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు గ్రామసభ నిర్వహించలేదు, లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. కొంత మంది డబుల్ బెడ్రూమ్ఇండ్ల కోసం డబ్బులు వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. జిల్లా కలెక్టర్ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించి లాటరీ పద్ధతిలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. దళారుల మాటలను నమ్మి పేదలు మోసపోవద్దు.
- మహబూబ్అలీ, తహసీల్దార్, చిన్నగూడూరు