- ములుగు జిల్లా కొండాయి వద్ద దయ్యాలవాగు దుస్థితి
- నాలుగు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ఆదివాసీలు
ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి వద్ద దయ్యాల వాగుపై కొద్ది రోజుల కింద నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. జులై నెలాఖరులో వచ్చిన వరదల కారణంగా దయ్యాలవాగు వంతెన కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుంచి అవతలి వైపు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.20 లక్షలతో తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు.
అయితే, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ మట్టి రోడ్డు కూడా సగం కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, మల్యాల, ఐలాపురం, కొత్తూరు గ్రామాలకు మరోసారి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మట్టి రోడ్డు పనుల్లోనూ అవకతవకలు జరిగాయని. వంతెనను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదివాసీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.