ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల రూ.2,026 కోట్ల నష్టం: ఆప్‎ను ఇరుకునపెట్టిన కాగ్ రిపోర్టు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిపోర్టు దేశ రాజధానిలో కాక రేపుతోంది. ఆమ్ ఆద్మీ సర్కార్ ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించిన నివేదికలో బయటపడింది. మద్యం పాలసీలో లైసెన్సుల జారీ, విధానపరమైన ఉల్లంఘనల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందనట్లు కాగ్ గుర్తించింది. అప్పటి కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన లిక్కర్ పాలసీ దాని లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని.. ఆప్ నాయకులు కిక్‌బ్యాక్‌ రూపంలో ప్రయోజనం పొందారని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీకి సంబంధించి నిపుణుల బృందం చేసిన సిఫారసులను అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం (జీఓఎం) విస్మరించిందని వెల్లడించింది. 

కేబినెట్ ఆమోదం లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా పాలసీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారని రిపోర్టులో కాగ్ హైలెట్ చేసింది. లిక్కర్ పాలసీలో టెండర్లు వేసిన కొన్ని సంస్థలపై ఫిర్యాదులు ఉన్నాయని.. బిడ్డర్ల ఆర్థిక పరిస్థితులను పరిశీలించలేకుండానే వేలానికి అనుమతించారని కాగ్ పేర్కొంది. అలాగే నష్టాల్లో ఉన్న సంస్థలకు మద్యం లైసెన్స్‌లు మంజూరు చేశారని వెల్లడించింది. 2021 నవంబర్‌ 17న ఆప్ సర్కార్ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఆప్ తీసుకొచ్చిన ఈ లిక్కర్ పాలసీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం పాలసీలో భారీగా అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. 

Also Read :- జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే ఈ రీజన్స్ చెప్పాడు..!

దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం 2022 సెప్టెంబరలో లిక్కర్ పాలసీని రద్దు చేసింది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. ఆప్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఆప్ నేతలు బిడ్డర్లకు లాభం చేకూరేలా వ్యవహరించి క్విక్ బ్యాక్ రూపంలో లబ్ది పొందారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్క ఢిల్లీలోనే కాకుండా తెలంగాణ, ఏపీ పాలిటిక్స్‎ను షేక్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి కీలక నేతలను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయగా.. బెయిల్‎పై వారు బయట ఉన్నారు. 

ప్రస్తుతం ఈ కేసును సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి రావడంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. కాగా రిపోర్టును ఆధారంగా చేసుకుని అధికార పార్టీపై బీజేపీ విమర్శలు ఎక్కు పెట్టింది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ కాగ్ రిపోర్టుపై స్పందిస్తూ.. అరవింద్ కేజ్రీవాల్‌ను "లిక్కర్గేట్ కింగ్‌పిన్"  అభివర్ణించారు. పేదలకు కోసం పాఠశాలలు నిర్మిస్తామని ఆప్ వాగ్దానం చేసింది కానీ దానికి బదులుగా మద్యం దుకాణాలను నిర్మించిందని విమర్శించారు. ఆప్ 10 సంవత్సరాల ప్రయాణం కుంభకోణాలతో సాగుతోందని ఆరోపించారు.