
కాగజ్ నగర్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఓ వైన్ షాపు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రూ.21 లక్షల విలువైన మద్యాన్ని మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. బుధవారం చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రెస్ మీట్లో కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే వైన్ షాప్‌లకు సీల్ వేశారు.
కానీ నిబంధలకు విరుద్ధంగా సీల్ చేసిన తర్వాత చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామ సమీపంలోని శ్రీనిధి వైన్ షాపు పక్కనున్న రూమ్‌లో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు ఎస్పీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, మధూకర్, నరేశ్ ఆకస్మిక దాడులు చేశారు. వైన్ షాప్ పక్కనే ఉన్న రూంలో నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకున్నారు.
దీంతోపాటు గ్రామంలోని మూడు బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేసి అక్కడ అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 700 కార్టన్ల మద్యం సీసాలు, బీరు సీసాలు పట్టుబడ్డాయని, వాటి విలువ రూ.21.50 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో నలుగురి మీద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
స్కూటీ లో తరలిస్తున్న రూ.18 వేల దేశీదారు పట్టివేత
మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న దేశీదారును పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. సమాచారం మేరకు కాగజ్ నగర్ శివారులో తనిఖీలు నిర్వహిస్తుం డగా అబ్దుల్ సోహెల్అనే వ్యక్తి స్కూటీ తరలిస్తున్న రూ.18 వేల విలువైన 400 దేశీదారు సీసాలను పట్టుకున్నారు. మద్యంతోపాటు వెహికల్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.