అదానీ ఇన్వెస్టర్లకు 6 రోజుల్లోనే 2.2 లక్షల కోట్ల లాభం

అదానీ ఇన్వెస్టర్లకు 6 రోజుల్లోనే 2.2 లక్షల కోట్ల లాభం

 

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు:  ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్‌‌ను తిరిగి సంపాదించడానికి అదానీ గ్రూప్ తీసుకుంటున్న చర్యలు ఫలితానిస్తున్నాయి.  డ్యూ డేట్ కంటే ముందుగానే లోన్లను తీర్చడం ద్వారా  ప్రమోటర్లు  తమ అప్పులను తగ్గించుకుంటున్నారు. వీటికి అదనంగా వివిధ దేశాల్లో రోడ్ షోలను నిర్వహించడం ద్వారా  కొత్త ఇన్వెస్టర్లను గ్రూప్ ఆకర్షిస్తోంది. ఫలితంగా అదానీ గ్రూప్  షేర్లు వరుసగా ఆరో సెషన్‌‌లో కూడా ర్యాలీ చేశాయి. అదానీ ఇన్వెస్టర్ల సంపద గత ఆరు సెషన్లలో  రూ.2.2 లక్షల కోట్లు ఎగిసింది. బుధవారం సెషన్‌‌లో   అదానీ గ్రీన్, టోటల్ గ్యాస్‌‌,  ట్రాన్స్‌‌మిషన్ షేర్లు  5 శాతం చొప్పున లాభపడి అప్పర్ సర్క్యూట్ టచ్ చేశాయి. అదానీ పవర్ షేర్లు 4 శాతం, అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ షేర్లు 2 శాతం పెరిగాయి. అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్‌‌ క్యాప్ రూ.9 లక్షల కోట్లను క్రాస్ చేసింది. షేర్లను తనఖాగా పెట్టి తీసుకున్న లోన్లలో రూ.7,374 కోట్లను వివిధ ఇంటర్నేషనల్ బ్యాంక్‌‌లకు, ఇన్‌‌స్టిట్యూషన్లకు  ప్రీపేమెంట్ చేశామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఫలితంగా అదానీ పోర్ట్స్‌‌,  ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌, ట్రాన్స్‌‌మిషన్‌‌, గ్రీన్ ఎనర్జీ కంపెనీల్లో ప్రమోటర్ల  అప్పులు తగ్గిపోనున్నాయి. తాజాగా ప్రకటించిన  ప్రీ–పేమెంట్స్‌‌తో కలిపి మొత్తం 2,016 మిలియన్ డాలర్ల (రూ.16,500 కోట్ల)  విలువైన లోన్లను  ఈ నెల 31 లోపే   చెల్లిస్తామని ప్రమోటర్లు ప్రకటించారు. 

షేర్లు జూమ్‌‌..

అదానీ గ్రూప్ షేర్లు గత  కొన్ని సెషన్ల నుంచి దూసుకుపోతున్నాయి. అదానీ  ఎంటర్‌‌‌‌ప్రైజెస్ షేర్లు  గత ఐదు సెషన్లలో 42 శాతం లాభపడ్డాయి.  అదానీ పవర్ షేర్లు 21 శాతం, ట్రాన్స్‌‌మిషన్ షేర్లు  22 శాతం, గ్రీన్ ఎనర్జీ షేర్లు 22 శాతం పెరిగాయి. అదానీ పోర్ట్స్ షేర్లు 18 శాతం, అదానీ టోటల్ గ్యాస్  26 శాతం, అదానీ విల్‌‌మార్ షేర్లు 22 శాతం ఎగిశాయి. ఎన్‌‌డీటీవీ షేర్లు 22 శాతం లాభపడగా, ఎసీసీ  షేర్లు 7 శాతం మేర, అంబుజా సిమెంట్స్ షేర్లు 13 శాతం మేర పెరిగాయి. 

రిచ్‌‌ లిస్టులో పైకి..

అదానీ షేర్లు దూసుకుపోతుండడంతో  గౌతమ్‌‌ అదానీ సంపద భారీగా పెరిగింది. ఫోర్బ్స్‌‌ రియల్‌‌ టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌‌లో  వారం క్రితం 30 వ ప్లేస్‌‌కు పడిపోయిన  ఆయన, తాజాగా ఆరు స్థానాలు ఎగబాకి 24 ప్లేస్‌‌కి చేరుకున్నారు. గౌతమ్ అదానీ సంపద  46.6 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, హిండెన్‌‌బర్గ్ రిపోర్ట్‌‌తో గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది 70 శాతం  మేర తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో 135 బిలియన్ డాలర్లతో టాప్‌‌ 3 లో ఉన్న ఆయన సంపద, హిండెన్‌‌బర్గ్ రిపోర్ట్‌‌ దెబ్బకు 38 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్‌‌లో మరిన్ని ఇన్వెస్ట్‌‌మెంట్లు.. అదానీ గ్రూప్‌‌లో మరింతగా ఇన్వెస్ట్ చేస్తామని జీక్యూజీ పార్టనర్స్‌‌ ఫౌండర్ రాజీవ్ జైన్ బుధవారం ఆస్ట్రేలియా మీడియాతో పేర్కొన్నారు.  వారం క్రితం అదానీ గ్రూప్ కంపెనీల్లో జీక్యూజీ  1.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  ‘ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. షేరు ధర బట్టి, కంపెనీ ఎర్నింగ్స్‌‌ బట్టి పోర్టుఫోలియో సైజ్ పెంచుకుంటాం’ అని ఆయన అన్నారు.  తమ ఇన్వెస్ట్‌‌మెంట్లకు రెస్పాన్స్ ఊహించిన దాని కంటే బాగుందని తెలిపారు. ఇతరులను ఫాలో కామని, తమ ఆలోచన విధానాలు డిఫరెంట్‌‌గా ఉంటాయని  వివరించారు.  లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత  అదానీ గ్రూప్‌‌తో ఇప్పటి వరకు మాట్లాడలేదని  జైన్‌‌ పేర్కొన్నారు.  మాట్లాడుకోవడానికి ఏం లేదన్నారు.

మరో రూ.4 వేల కోట్ల అప్పు తీర్చేశాం..

అదానీ గ్రూప్  ప్రమోటర్లు మరో 500 మిలియన్ డాలర్ల (రూ.4,000 కోట్ల)  లోన్‌ను మంగళవారం తీర్చారని  బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్ చేసింది. ఈ లోన్ అమౌంట్ డ్యూ  గురువారం ఉందని తెలిపింది.  అదానీ గ్రూప్ ఇప్పటి వరకు 2 బిలియన్ డాలర్ల లోన్‌ను డ్యూ డేట్ కంటే ముందుగానే చెల్లించిందని, బాండ్ పేమెంట్లను  టైమ్‌కి పూర్తి చేసిందని, దీంతో పాటు జీక్యూజీ నుంచి 1.9 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ను సంపాదించగలిగిందని  బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ‘హోల్సిమ్‌ లిమిటెడ్‌ నుంచి సిమెంట్ బిజినెస్‌లను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్‌ గ్లోబల్‌ బ్యాంక్‌ల నుంచి 4.5 బిలియర్ డాలర్లు అప్పు తీసుకుంది. ఇందులో కొంత బకాయిలను గురువారం లోపు చెల్లించాలి. మిగిలిన వాటిని వచ్చే ఏడాది లోపు చెల్లించాలి’ అని రిపోర్ట్ చేసింది.