కొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్​డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ

కొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్​డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ
  • ఉమ్మడి జిల్లాలో 1,198 పాఠశాలలకు రూ.2.37కోట్లు మంజూరు 
  •  ప్రతి ఐదేళ్లకోసారి కొత్త గిన్నెలు ఇవ్వాలన్న రూల్​పట్టించుకోని గత ప్రభుత్వాలు 

భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిడ్​డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ పడింది. ఏండ్ల తరబడి పాత గిన్నెలలోనే విద్యార్థులకు వండి వార్చుతూ నానా యాతనలు పడుతున్న వేళ కాంగ్రెస్​సర్కారు కొత్త గిన్నెలను కొనుగోలు చేసి ఇచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,198 పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ రూ.2.37కోట్లను మంజూరు చేసింది. వీటితో మిడ్​డే మీల్స్ ఏజెన్సీలకు కొత్త గిన్నెలను కొనుగోలు చేయాలని ఆదేశించింది.  హైదరాబాద్​లోని ఓ సంస్థకు  టెండర్లు ఇచ్చి కొత్త గిన్నెలను కొన్నారు. మండల విద్యాశాఖల ద్వారా వాటిని ఆయా ఏజెన్సీలకు పంపిణీ చేస్తున్నారు. 

ఐదేళ్ల నిబంధన పాటించాలి.. 

స్కూళ్లలో మిడ్​ డే మీల్స్ ఏజెన్సీలకు ఐదేండ్లకోసారి పాత గిన్నెల స్థానంలో  కొత్త గిన్నెలు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ దుస్థితిని  గమనించిన కాంగ్రెస్​సర్కారు పాత గిన్నెలను మార్చాలని నిర్ణయించి నిధులు కేటాయించింది. పిల్లలకు పోషకాహారం అందించడమే మిడ్​డే మీల్స్ ఉద్దేశ్యం కాగా, గిన్నెలు సరిగా లేక అన్నం, కూర సరిగా కావడంలేదనే ఫిర్యాదుల వచ్చాయి. 

ఈ నేపథ్యంలో సర్కారు కొత్త గిన్నెలు కొనుగోలు చేసేందుకు రూ.2.37కోట్లు విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో 902 స్కూళ్లు ఉండగా రూ.1.16కోట్లు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,016 స్కూళ్లకుగాను రూ.1.21కోట్లతో గిన్నెలను కొనుగోలు చేశారు. విద్యార్ధుల సంఖ్య ప్రకారం ఈ నిధులను ఖర్చు 
చేశారు. 50 మంది స్టూడెంట్లు ఉన్న స్కూల్​కు రూ.10వేలు, 51 నుంచి 150 మంది ఉన్న స్కూల్​కు రూ.15వేలు, 151 నుంచి 250 మంది ఉన్న స్కూల్​కు రూ.20వేలు, 251కి పైగా ఉన్న స్కూల్​కు రూ.25వేలు కేటాయించారు. మండలం వారీగా ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, హైస్కూళ్లకు వీటిని పంపిణీ చేస్తున్నారు.

ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం 

ఇన్నాళ్లు పాత గిన్నెల్లో వంటలు వండుతూ ఇబ్బందులు పడ్డాం. వాటిలో వండితే ఒక్కోసారి అన్నం ఉడికేది కాదు. ఎంత మంచిగా వండినా ఏదో ఒక తేడా కన్పించేది. ఇప్పుడు కొత్త గిన్నెలు ఇవ్వడం సంతోషంగా ఉంది. 

రామక్క, మిడ్​డేమీల్స్ ఏజెన్సీ నిర్వాహకురాలు